ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిట్టడానికి ఆయన తండ్రి దివంగత వైఎస్సార్‌ను చంద్రబాబు పొగడాల్సి వచ్చింది. ఇదే సందర్భంలో వైఎస్సార్ చొరవ వల్లే అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను ఆంధ్రాలో నెలకొల్పారనే వాస్తవాన్ని బాబు జనానికి చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ చూసిన టీడీపీ నేతలు… జగన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో ఆయన తండ్రిని పొగడాల్సి వస్తోందని, ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకోవడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో టీడీపీ జనంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సైకో సీఎం జగన్ చేతిలో రాష్ట్రం నాశనమైపోతోందని మండిపడ్డారు. ఈ సైకో వల్ల పెట్టుబడులుదారులు పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరరాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్లు పెట్టుబడులు ఆంధ్రాలో పెట్టకుండా తెలంగాణలో పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఆ పరిశ్రమకు మాజీ సీఎం రాజశేఖరరెడ్డి భూములిస్తే ఆయన కొడుకు కబ్జా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే తానని, అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం చూశాం.
ఇతర పాలకులు చేసిన మంచి గురించి మరుగున పడేసే చంద్రబాబు … అనివార్యంగా తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వైఎస్సార్ పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని జనానికి చంద్రబాబు చెప్పాల్సిన పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు. జగన్‌ను విమర్శించడానికైనా ఆయన తండ్రిని గొప్ప పాలనాదక్షుడిగా చంద్రబాబు ప్రచారం చేయాల్సి వస్తోంది. టీడీపీకి ఇష్టం లేకపోయినప్పటికీ, పరిస్థితులు మాత్రం వాస్తవాల్ని ప్రజలకు వివరించాల్సి వస్తోందని సరిపెట్టుకోవాల్సి వస్తోంది.