26, 27 తేదీలు.. వలసలలో ‘పులస’లు ఉంటాయా?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఇప్పుడు కొనసాగుతున్న పార్టీని కాదనుకుని, అక్కడ ఇమడలేక మరో పార్టీని ఆశ్రయిస్తామనే ఆలోచన ఈ దశలో చాలా మందిలో నడుస్తూనే ఉంటుంది. అయితే.. ఇలాంటి వలస ఆలోచనలన్నీ కూడా రెండు…

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఇప్పుడు కొనసాగుతున్న పార్టీని కాదనుకుని, అక్కడ ఇమడలేక మరో పార్టీని ఆశ్రయిస్తామనే ఆలోచన ఈ దశలో చాలా మందిలో నడుస్తూనే ఉంటుంది. అయితే.. ఇలాంటి వలస ఆలోచనలన్నీ కూడా రెండు రోజుల్లోనే ఒక కొలిక్కి రానున్నాయి. 26, 27 తేదీలలోనే తెలంగాణ వలసలు చాలా వరకు పూర్తయిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

అధికారంలో ఉన్న భారాస అభ్యర్థుల జాబితాను పూర్తిస్థాయిలో ప్రకటించేసిన తర్వాత.. ప్రస్తుతం చాపకింద నీరులాగా, నివురు గప్పిన నిప్పులాగా.. ఆ పార్టీలో అసంతృప్తులు చెలరేగుతున్నాయి. గుర్తించగలిగిన చోట వారిని బుజ్జగించడానికి గులాబీ దళాలు పెద్దఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయితే.. అసంతృప్తులందరికీ గేలం వేసి తమ బుట్టలోకి లాగేసుకోవడానికి అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే 26, 27 తేదీలు మాత్రమే ఎందుకు కీలకం అనేది ఇప్పుడు ముఖ్యం.

26వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ప్రియాంక గాంధీ వస్తుందని రకరకాలుగా ఊదరగొట్టారు గానీ, ప్రస్తుతానికి మల్లికార్జున ఖర్గే మాత్రమే వస్తున్నారు. అయినా సరే.. దీనిని ధూంధాంగా చేయాలని పార్టీ అనుకుంటోంది. ఈ సభలో ఖర్గే సమక్షంలో వీలైనంత మంది ఇతర పార్టీ నాయకులను కాంగ్రెసులోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారు. భారీ ఎత్తున చేరికలు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో, 27వ తేదీన ఖమ్మంలో అమిత్ షా ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరగబోతోంది. 

అమిత్ షా ఆధ్వర్యంలో భాజపాలోకి కూడా వలసలు పోటెత్తాలని, చేరికలు లేకుండా కేవలం సభ నిర్వహిస్తే పార్టీ పరువు పోతుందని కమల నాయకులు కూడా కంగారు పడుతున్నారు. వారు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. కాంగ్రెసును వీడి రావడానికి, ఈ సమయంలో ఎవ్వరూ సుముఖంగా లేకపోగా, ఇక భారాసలో టికెట్లు దక్కని ఆశావహులు, నియోజకవర్గాల్లో సెకండ్ గ్రేడ్ నాయకుల మీద కమలం ఫోకస్ పెంచుతోంది. కాబట్టి ఈ రెండు సభల్లో కూడా భారీగా వలసలు ఉంటాయనేది గ్యారంటీ.

వలసలు ఓకే గానీ.. ఆ వలసలలో ‘పులస’లు ఉంటాయా? లేదా? అనేదే ఇప్పుడు చర్చ. పెద్ద నాయకులతో కండువా కప్పించుకుని, ఆ ఫోటో ఫ్రేం కట్టి ఇంట్లో దాచుకోవడానికి చాలా మంది నాయకులు పార్టీలో చేరవచ్చు. కానీ చేరికల్లో గట్టివారు ఎందరో పార్టీలు సమీక్షించుకోవాలి. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగగలిగినవారు, దిగి నెగ్గగలిగిన వారు ఎందరనేది పరిశీలించాలి. 

ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలు కూడా చాలామందితో మంతనాలు సాగిస్తున్నా.. గుంభనంగా ఉంచుతున్నారు. బిజెపిలోంచి కూడా కొందరు నాయకులను తమలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అగ్రనేతల భారీ బహిరంగ సభల సమయానికి ఎందరు గట్టి నేతల్ని తమ జట్టులో కలుపుకోగలరో వేచిచూడాలి.