మా తాతలు నేతలు తాగారు అంటున్న చినబాబు

చినబాబు నారా లోకేష్ తన చదువు సంధ్యలను విదేశాలలో ఎంత మాత్రం ఉద్ధరించారో ఏమో తెలియదు గానీ ధ్రువపత్రాలు మాత్రం పుష్కలంగానే ఉన్నాయి. ఆయన సుదీర్ఘకాలం విదేశాలలో హిస్టరీ చదువుకున్నారేమో తప్ప సైన్స్ అండ్…

చినబాబు నారా లోకేష్ తన చదువు సంధ్యలను విదేశాలలో ఎంత మాత్రం ఉద్ధరించారో ఏమో తెలియదు గానీ ధ్రువపత్రాలు మాత్రం పుష్కలంగానే ఉన్నాయి. ఆయన సుదీర్ఘకాలం విదేశాలలో హిస్టరీ చదువుకున్నారేమో తప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినట్లుగా లేదు. ఎందుకంటే హిస్టరీ చదివిన వాళ్లు గతించిపోయిన విషయాలను గురించి మాట్లాడుతుంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినవారు రాబోయే తరాలలో సంభవించగల పరిణామాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి మన చినబాబు నారా లోకేష్ తాను హిస్టరీ స్టూడెంట్ మాత్రమే అని చాటుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో ఆయన గతించిపోయిన చరిత్ర గురించి మాట్లాడుతున్నారు తప్ప, భవిష్యత్తు మీద ప్రజలలో ఒక ఆశ కల్పించడానికి ప్రయత్నించడం లేదు. ప్రభుత్వాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా అనేక రకాల సంక్షేమ పథకాలు తెస్తుంటాయి. తర్వాత అవి రూపు మారిపోతూ కూడా ఉంటాయి. అయితే ఈ పథకాలలో వృద్ధాప్య పింఛను అనేది చాలా కీలకం. సమాజంలో వృద్ధులకు జీవితం పట్ల ఒక భరోసా అందించినందుకు మాత్రమే కాదు, ఓటు బ్యాంకు పరంగా కూడా వృద్ధాప్య పెన్షన్లు పార్టీలకు కీలకం అవుతాయి.

ప్రస్తుతం పాదయాత్రలో నడుచుకుంటూ వెళుతున్న నారా లోకేష్ తాజాగా వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన తెచ్చారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని మించినది లేనేలేదని, 200 రూపాయల పెన్షన్ ను రెండు వేల రూపాయల వరకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది మాత్రమే అని టముకు వేసుకుంటున్నారు. నిజానికి పెన్షన్ 2000 వరకు పెంచుతూ అప్పట్లో చంద్రబాబు నిర్ణయం తీసుకోడం జగన్ పుణ్యం. 

జగన్ తన పాదయాత్రలో వృద్ధులకు పెన్షన్లు 2000 చేస్తాను అనడం వలన కంగారుపడిన చంద్రబాబునాయుడు తన ప్రభుత్వం చివరి రోజుల్లో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా జగన్ వాగ్దానానికి చెక్ పెట్టగలనని అనుకున్నారు. అయితే జగన్ పోటాపోటీగా తాను రూ3000 చేస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా 250 వంతున పెంచుతూ మాట నిలబెట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలలోగా వాగ్దానం పూర్తవుతుంది.

ఇప్పుడు యాత్రలో ప్రజల ముందుకు వెళుతున్న నారా లోకేష్ ఎప్పుడో తన తండ్రి కాలంలో- చరిత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ వృద్ధాప్య పెన్షన్ పెంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ కూర్చుంటారా? లేదా ఈసారి అధికారంలోకి వస్తే తాము మళ్లీ ఎంత పెంచగలం అనే విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వగలరా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పెన్షన్ల గురించి ఏమీ మాట్లాడడం లేదు. పంపిణీ లోపరహితంగా, పద్ధతిగా జరిగితే చాలు.. అనే ఫోకస్ తోనే ఉన్నారు.

అదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెన్షన్ల వేలం పాటను బాగా పెంచేసింది. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి నాలుగు వేలవంతున ఇస్తామని వారు అంటున్నారు. అదే సమయంలో పెన్షన్ పెంచడం మాకు చేత కాదా, మేం కూడా పెంచగలం అనే మాటల ద్వారా, పెన్షన్ల పెంపు కోసం కాంగ్రెస్కు ఓటు వేయాల్సిన అవసరం లేదు అని కెసిఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. సంకేతాలు ఇస్తున్నారు. ఆల్రెడీ వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ చేసిన కేసీఆర్ పెద్ద సంఖ్యలో ఉండే వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కాస్త ముందువెనకా నిర్ణయం తీసుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ పెన్షన్ల విషయంలో నోరు మెదపలేని పరిస్థితిలో ఉండడం గమనార్హం. ప్రజా సంక్షేమం అనే పదానికి తెలుగుదేశం విరుద్ధం అని ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తం అందజేయడం అనే కాన్సెప్ట్ మీదనే తెలుగుదేశానికి విశ్వాసం లేదని అందుకే ఇలాంటి గారడీ మాటలతో పొద్దు పుచ్చుతున్నారని పలువురు అనుకుంటున్నారు.