సీఎం ఆశావహ నేత.. రాజకీయాలు వదలుకున్నట్టే!

ఒకప్పట్లో ఆయన కాంగ్రెసు పార్టీలో చాలా కీలకమైన నాయకుల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో.. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. ఉద్యమాన్ని సంబాళించలేని అశక్తతలో కాంగ్రెస ప్రభుత్వం పడి ఉన్నప్పుడు.. ఉద్యమాన్ని…

ఒకప్పట్లో ఆయన కాంగ్రెసు పార్టీలో చాలా కీలకమైన నాయకుల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో.. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. ఉద్యమాన్ని సంబాళించలేని అశక్తతలో కాంగ్రెస ప్రభుత్వం పడి ఉన్నప్పుడు.. ఉద్యమాన్ని అణిచేయడానికి లేదా, రాష్ట్ర ఏర్పాటు కోరికను సద్దుమణిగేలా చేయడానికి తెలంగాణకు చెందిన నాయకుడినే ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రతిపాదన కొంత వినిపించింది. ఆ సమయంలో ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది ఆయన పేరే. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని బాగా ప్రచారం జరిగింది. 

ఎంతగా అంటే.. ప్రమాణ స్వీకారం రోజు ధరించడానికి ఆయన ప్రత్యేకంగా ఒక బంద్‌గలా సూటు కూడా కుట్టించుకున్నారు. కానీ ఆ తర్వాతి పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావడం.. ఆయన నిరాశ పడడం జరిగాయి. అప్పటినుంచి తాను సీఎం స్థాయి నాయకుడినని, పార్టీ గెలిస్తే సీఎం పోస్టు వస్తుందని అనుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా రాజకీయాలనుంచే తప్పుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మరెవ్వరో కాదు. సీనియర్ నేత కుందూరు జానారెడ్డి. 

ప్రస్తుతం ఆయన అసెంబ్లీ స్థానం నాగార్జున సాగర్ నుంచి అభ్యర్థిత్వం కోసం ఆయన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి దరఖాస్తు చేయడంతో.. రాజకీయాల్లో జానారెడ్డి శకానికి తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు.

జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కూడా ఏకంగా 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన జానారెడ్దడి, 2018 ఎన్నికల్లో మాత్రం.. 8 వేల ఓట్ల తేడాతో నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. నోముల మరణం ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన కొడుకు నోముల భగత్ మీద మళ్లీ పోటీచేశారు గానీ.. ఓటమితేడా 18వేలకు పెరిగింది.

దీనికి తోడు, ఆయన తన వారసులను రాజకీయాల్లోకి తేవాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. గతంలో తన కుటుంబానికి రెండు టికెట్లు కూడా ఆశించారు. అయితే ఇప్పుడు జానా ప్రాతినిధ్యం వహించిన నాగార్జున సాగర్ కు ఆయన కొడుకు దరఖాస్తు చేసుకోవడంతో.. సీన్ మారింది. ఆయన క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకుని.. పార్టీకి పెద్దదిక్కుగా మాత్రమే కొనసాగుతారనే చర్చ జరుగుతోంది. 

ఒకప్పట్లో తానే సీఎం కాబోతున్నానని అనుకున్న నాయకుడు.. ఇప్పుడు పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్టేనా? లేదా, అసెంబ్లీకి కొడుకును బరిలోకి దించి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయడం వలన ఖాళీ అయ్యే నల్గొండ పార్లమెంటు స్థానంనుంచి గెలిచి ఢిల్లీ వెళ్లాలని కలగంటున్నారా? అనేది వేచిచూడాలి.