భారత రాష్ట్ర సమితిని తెలంగాణలో మట్టి కరిపించి తాము అధికారంలోకి రావాలనే కోరిక రెండు ప్రతిపక్ష పార్టీల్లోనూ ఉంది. అయితే ఇప్పుడు, అంతే సమానంగా.. కేసీఆర్ ను ఓడించాలనే తపన కూడా ఆయన ప్రత్యర్థుల్లో వ్యక్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఓడించడానికి, అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
ప్రతిపక్షాలకు సంబంధించినంత వరకు.. ఒక్కో పార్టీలోనే బోలెడు గ్రూపులు, ముఠాలు నడుస్తుండగా.. ఈ పార్టీలన్నీ కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రావడం.. అందరూ మనస్ఫూర్తిగా అతని విజయం కోసం పనిచేయడం అనేది సాధ్యమేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయిన తొలినాళ్ల నుంచి ఆయనకు ప్రత్యర్థిగా మారిన ప్రొఫెసర్ కోదండరాం.. తాజాగా ఉమ్మడి అభ్యర్థి అనే ప్రతిపాదన తెచ్చారు. కేసీఆర్ అహంకారాన్ని ఓడించడానికి ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని బలపరిచి గెలిపించాలనేది ఆయన ఆలోచేన.
మొన్నమొన్నటిదాకా భారాసతో పొత్తులకోసం తీవ్రమైన ప్రయత్నాలు చేసి భంగపడి, చివరకు ఇప్పుడు కేసీఆర్ మీద నిప్పులు చెరగుతున్న వామపక్షాలు కూడా ఇదే మాట అంటున్నాయి. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థినే గెలిపించాలంటున్నాయి. అయితే వీరి మధ్య సఖ్యత కుదురుతుందా? అనేది అనుమానం.
గజ్వేల్ లో కేసీఆర్ గత ఎన్నికల్లో ఏకంగా 58 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెసుకు చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఓడించారు. ఆతర్వాతి పరిణామాల్లో ప్రతాప్ రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి చోట పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించినా ప్రయోజనం ఎంత ఉంటుందో చెప్పలేం. అదే కామారెడ్డి విషయానికి వస్తే.. అక్కడ గత ఎన్నికల్లో భారాసకు చెందిన గంపగోవర్దన్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ మీద సాధించిన మెజారిటీ కేవలం అయిదువేలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ సీటు మీద ప్రతిపక్షాలు కన్నేస్తున్నాయి.
అయితే ఉమ్మడి అభ్యర్థి, అందరికీ ఆమోదయోగ్యుడు అనే మాయమాటలు చెబుతూ.. ప్రొఫెసర్ కోదండరాం లేదా మరొక వామపక్ష నాయకులను అక్కడ అభ్యర్థిని చేస్తే వారికి టెంకిజెల్ల పడుతుంది. గత ఎన్నికల్లో భారాస కు గట్టిపోటీ ఇచ్చిన షబ్బీర్ ఆలీనే అభ్యర్థిని చేస్తేనే కాస్త ఫలితముంటుంది.
షబ్బీర్ అలా అభ్యర్థిత్వానికి కోదండరాం లాంటి వాళ్లు, వామపక్షాలు గట్టిగా పనిచేయాలి. అలా జరిగితే సాధ్యమవుతుంది తప్ప.. అక్కడ ఉమ్మడి అభ్యర్థిని పెడుతున్నాం గనుక.. కాంగ్రెసు అభ్యర్థికి మద్దతిస్తున్నాం గనుక.. ఇతర ప్రాంతాల్లో క్విడ్ ప్రోకో ప్రత్యుపకారం కోసం కాంగ్రెస్ తో డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటే అది సాధ్యం కాదు.
ప్రతిపక్షాల ఐక్య అభ్యర్థి అనే ప్రతిపాదనకు బిజెపి ఎటూ సహకరించదు. కాబట్టి.. ప్రతిపక్షాలు ఈ దిశగా కసరత్తు చేస్తేనే.. కనీసం వారి ఆలోచనలో విలువ ఉన్నదని నిరూపణ అవుతుంది.