యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర టీడీపీకి రాజకీయంగా లాభం చేస్తుందని అనుకున్నారు. అలాగే నాయకుడిగా లోకేశ్ స్ట్రాంగ్‌గా తయారవుతారని టీడీపీ నేతలు ఆశించారు. కానీ పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ బలమైన నాయకుడు కావడం సంగతి పక్కన పెడితే, చిల్లర మనిషిగా తయారవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాదయాత్రలో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో లోకశ్ మాటతీరు గమనిస్తే, అతని రాజకీయ భవిష్యత్‌పై అనుమానాలు కలుగుతున్నాయి.
చంద్రబాబు నీడలో లోకేశ్‌ను సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవిస్తున్నారు. అంతే తప్ప, తనకంటూ నాయకత్వ లక్షణాలు న్నాయని నిరూపించుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారనేది మెజార్టీ అభిప్రాయం. ఇంత వరకూ లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి. లోకేశ్ మాటలు కోటలు దాటడం తప్ప, ఆచరణలో అంత సీన్ లేదని తనకు తానుగా నిరూపించుకున్నారు. లోకేశ్ మనసెరిగి అతను చుట్టూ చిల్లర బ్యాచ్ చేరుతోంది.
గన్నవరం బహిరంగ సభలో లోకేశ్ మెప్పుకోసం కొందరు నేతలు హద్దులు దాటి మాట్లాడాన్ని చూడొచ్చు. చంపుతాం, నరుకుతాం, తరిమి కొడ్తాం లాంటివి యథేచ్ఛగా దొర్లాయి. గుడివాడలో కట్డ్రాయర్పై కొడాలి నానిని తిప్పుతామని లోకేశ్ అన్నారు. ఇదీ లోకేశ్ భాష. ఇదీ ఆయన వ్యక్తిత్వం. లోకేశ్ నాయకత్వ లక్షణాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో చెప్పడానికి ఈ చిల్లర మాటలు చాలు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అవాకులు చెవాకులు పేలడాన్ని అర్థం చేసుకోవచ్చు.
కానీ టీడీపీ భవిష్యత్ రథసారథిగా చెలామణి అవుతూ, ఇంత నేలబారు మాటలు మాట్లాడ్డంపై లోకేశ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీడీపీ శ్రేణుల్ని సంతృప్తిపరచడానికి డ్రాయర్ల భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపోటములే పార్టీలను, నాయకులను అందలం ఎక్కించడం లేదా పాతాళానికి తోయడం చేస్తాయి. గన్నవరం, గుడివాడలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలను ఓడించగలిగితే అంతకంటే టీడీపీ శ్రేణులకు ఆనందం ఏముంటుంది?
అలాంటి వాటి కోసం వ్యూహాలు రచించకుండా చిల్లర మాట్లాడ్డం వల్ల, తాను పలుచన అవుతానని లోకేశ్ ఎందుకు గ్రహించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లోకేశ్‌కు అలాంటి ఉన్నత ఆలోచనలు లేకపోయినా, కనీసం ఆయన స్థాయికి తగ్గట్టు ఉండాలని చెప్పేవాళ్లే లేరా? లోకేశ్ పాదయాత్ర చేయడం కదా, నడుచుకునే తీరే అంతిమంగా ప్రజల ఆదరణ లేదా తిరస్కరణ పొందడంపై ఆధారపడి వుంటుంది.