తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ దళిత నేతలు రుసరుసలాడుతున్నారు. రాజకీయ స్వార్థంతో టీడీపీకి చేరువైన శ్రీదేవికి ముఖ్యంగా లోకేశ్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి ఉండవల్లి శ్రీదేవిని బరిలో దింపుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ సీటు ఆశిస్తున్న పనబాక లక్ష్మి, తదితర నేతలు టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
ఓడిపోయే తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తనకిస్తూ, అవకాశం ఉన్న బాపట్లలో రాజకీయ అవకాశవాది శ్రీదేవిని నిలబెట్టాలని అనుకోవడంపై పనబాక లక్ష్మి పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే బాపట్ల, తాడికొండలలో ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లు ఆశిస్తున్న సూటుబాటు సార్, అమరావతి ఉద్యమకారుల పేరుతో టీడీపీ జెండా మోస్తున్న మరో ఇద్దరు దళిత నేతలు శ్రీదేవి రాకను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకవేళ శ్రీదేవికి బాపట్ల సీటు ఇస్తే, తప్పక ఓడిపోతుందని వారు శాపనార్థాలు పెడుతున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపును అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన ఉండవల్లి శ్రీదేవి, ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం టీడీపీ పంచన చేరారని వారు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ చేసిన ద్రోహం కంటే, రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా శ్రీదేవి చేసిందే ఘోరమైందని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఏ రకంగా చూసినా ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల ఖర్చు పెట్టుకుంటుందనే కారణంతో శ్రీదేవిపై లోకేశ్ అభిమానాన్ని పెంచుకుంటున్నారని దళిత టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి ధోరణులు టీడీపీకి నష్టం కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.