‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగబాకుతా నన్నదని’ సామెత! ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరిస్థితిని గమనిస్తే మనకు ఆ సామెతే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ ప్రస్తుతానికి శవాసనం వేసి ఉంది. ఊతకర్రలతో లేపినా సరే నిలబడే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోనూ పోటీకి దిగుతామని ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
తమాషా ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలలో తమ పార్టీ పట్ల అభిమానం ఇప్పటికీ అలాగే పదిలంగా ఉన్నదని తెలుగుదేశం నాయకులు భావిస్తూఉంటారు. ఇక్కడ తమ పార్టీ పూర్తిగా అంతరించిపోవడానికి కొంతమంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోవడం మాత్రమే కారణం అని వ్యాఖ్యానించేవారు.. ప్రజాభిమానం మాత్రం స్థిరంగా ఉందని చెబుతూ ఉంటారు! ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామని కూడా చాలా కాలంగా చెబుతూ ఉన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ సారథిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత పార్టీలో కొంత వేడి పుట్టింది. కొడుకును కూడా ఎమ్మెల్యే చేయాలని అనుకుంటున్న కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ కోసం డబ్బు వెదజల్లడం ప్రారంభించారు. ఖమ్మం లో చంద్రబాబు నాయుడుతో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సభలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా కూడా కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. తద్వారా తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ప్రజాభిమానాన్ని తిరిగి వారికి గుర్తు చేస్తామని అన్నారు.
నెమ్మదిగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం కాస్త వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్న తరుణంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కీలక నాయకులతో బస్సు యాత్ర చేస్తామని కొంతకాలం కిందట ప్రకటించారు.
మొన్న 23వ తేదీన హైదరాబాద్ పెద్దమ్మ గుడి వద్ద చంద్రబాబునాయుడు బస్సు యాత్రను ప్రారంభించేలాగా, జంట నగరాల్లో తో పాటు అన్ని నియోజకవర్గాలలో బస్సు యాత్ర కొనసాగేలాగా ప్లాన్ చేశారు. అన్నారు కానీ ఆ యాత్ర కూడా ప్రారంభం కాలేదు.
బస్సు వేసుకొని కొందరు నాయకులు ఒక్కొక్క ఊరికీ వెళ్లినంత మాత్రాన కనీసం అక్కడ వారికి స్వాగతం పలికేది ఎవరు? ఆయా ఊర్లలో బస్సు మీద వచ్చిన నాయకులు చిన్న సభ లాంటిది పెట్టి కాసిని మాటలు మాట్లాడాలనుకుంటే వినడానికి అవసరమైన జనాన్ని పోగు చేసేది ఎవరు? అనే సమస్యలు తలెత్తాయి. ఆ మాత్రం కూడా పార్టీకి క్షేత్రస్థాయి నిర్మాణం గతిలేని పరిస్థితిలో ప్రస్తుతం తెలుగుదేశం ఉంది.
ఒకప్పట్లో తెలంగాణ అంతటా తమ పార్టీకే వైభవ స్థితి ఉన్నదని వారు ఎంతగానైనా టముకు వేసుకోవచ్చు గాక, కానీ ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని అంగీకరించి తీరాల్సిందే!
అయితే కనీసం బస్సు యాత్ర చేయడానికి కూడా దిక్కులేని తెలుగుదేశం పార్టీ డాంబికాలు పలకడం ఎందుకు? అనేది ప్రజల ప్రశ్న. ‘119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం’ లాంటి డైలాగులు వేయడం ఎందుకు? అని వారు అడుగుతున్నారు. తమకు బలమున్న కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తే కనీసం ఒకటి రెండు గెలిచి సభలో అడుగుపెట్టగలిగినా పరువుగా ఉంటుంది కదా అంటున్నారు. అంచెలంచెలుగా పార్టీని పునర్నిర్మాణం చేయవచ్చు కదా అనేది పలువురి సూచన.
కానీ 119 చోట్ల అభ్యర్థులను వెతుకుతున్నాం జాబితా తయారు చేయడానికి కమిటీని నియమించాం అని ఆడంబరపు మాటలు పలికితే గనుక పార్టీకి ముందు ముందు కూడా ఇబ్బందులే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.