జగన్ సర్కార్‌కు అనవసరంగా చెడ్డ పేరు తెచ్చే పనులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం అనవసర దుబారా ఖర్చు చేస్తోంది. ఎవరూ తినింది లేదు, చేసింది లేకుండానే… ప్రజల సొమ్ము సత్కారాలు, అవార్డుల పాలవుతోంది.
అసలే కరోనా విపత్కర పరిస్థితులతో రాష్ట్ర ఆదాయానికి భారీ గండిపడింది. మరోవైపు సంక్షేమ పథకాల అమలు పుణ్యమా అని …మరే ఇతర పథకాలకు డబ్బు మంజూరు చేయలేని దీనస్థితి. మరోవైపు అప్పులు చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిన పరిస్థితి.
ఆర్థిక క్రమశిక్షణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో, దుబారా ఖర్చులకు వెనుకాడకపోవడం గమనార్హం. జీతాలు పెంచండి మహాప్రభో అని వేడుకుంటున్న గ్రామ, వార్డు వాలంటీర్ల కడుపు నింపే చర్యలు చేపట్టకుండా, సత్కారాలు, అవార్డులు అంటూ ప్రభుత్వం మభ్యపెట్టే పనులకు శ్రీకారం చుట్టిందనే విమర్శలు లేకపోలేదు.
జగన్ సర్కార్ వచ్చీ రావడంతోనే చేసిన మంచి పని సచివాలయ వ్యవస్థను నెలకొల్పడం. ఆ వ్యవస్థకు అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని నియమించారు.
నెలకు రూ.5 వేలు గౌరవ వేతనంతో వారు సేవలందిస్తున్నారు. ప్రతి వస్తువు ధర పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలు గౌరవ వేతనం ఎంత వరకు సబబో ఆలోచించాల్సి వుంది. మరోవైపు తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వాలంటీర్లు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో వాలంటీర్లు తమకు వేతనం పెంచాలని ఆందోళన బాట పడితే… సత్కారాలు, అవార్డుల పేరుతో వారిని సముదాయించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మంచి పనితీరు కనబరిచిన గ్రామ, వార్డు వాలంటీర్లను ఉగాది నాడు నగదు పురస్కారం, అవార్డులతో సత్కరించేందుకు ప్రభుత్వం రూ.261.65 కోట్లు మంజూరు చేసింది. ఇది వాలంటరీ వ్యవస్థలో న్యూసెన్స్‌కు దారి తీస్తుంది.
ఒక గ్రామంలో పది మంది వాలంటీర్లు ఉంటే, ఒకరిద్దరికి మాత్రమే నగదు పురస్కారం, అవార్డులు అందజేస్తే… ఇక మిగిలిన వాళ్లను అవమానించినట్టు కాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవైపు డబ్బు ఖర్చు చేస్తూ… మరోవైపు మెజార్టీ వాలంటీర్ల నుంచి వ్యతిరేకతను కొనుక్కున్నట్టు కాదా? అనే ప్రశ్నలు ప్రధానంగా వైసీపీ నుంచి రావడం గమనార్హం.
ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చేలా సలహాలు ఎవరిస్తున్నారో అని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ సర్కార్‌కు ఇలాంటి గొప్పగొప్ప సలహాలు ఇస్తున్న మహానుభావులకు ఉగాది పర్వదినం నాడు ముందుగా సత్కారాలు చేయాలని నెటిజన్స్ వ్యంగ్యంగా అంటున్నారు.