దేశ రాజకీయ చరిత్రలో కొన్ని ప్రముఖ ఘట్టాలుంటాయి. నూతన రాజకీయానికి దారి చూపినవి, కొత్త రాజకీయ చైతన్యాన్ని కలిగించినవి, కొత్త చరిత్రకు ప్రారంభంగా నిలిచిన ఘట్టాలవి. సరిగ్గా.. ఇప్పుడు అలాంటి అంశాల సరసన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన రాజకీయ అడుగులను ప్రస్తావిస్తూ ఉంది జాతీయ మీడియా! కాంగ్రెస్ అధినాయకత్వం తీరును విశ్లేషిస్తూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టోరీని ప్రముఖంగా మెన్షన్ చేస్తోంది జాతీయ మీడియా.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వం పై విసిగిపోయిన వారు జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలని, జగన్ మోహన్ రెడ్డి తరహాలో ముందుకు వెళ్లడమే వారికి ఉన్న ఏకైక పరిష్కారమని జాతీయ మీడియా విశ్లేషించి చెబుతోంది. పుష్కరకాలం కిందట జగన్ వేసిన సాహసోపేతమైన అడుగులను సక్సెస్ స్టోరీగా, సరైన నిర్ణయంగా విశ్లేషిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, కాంగ్రెస్ నేతలు కూడా జగన్ ను స్మరిస్తున్నారు! ఈ మధ్యనే గోవా మాజీ ముఖ్యమంత్రి ఒకరు కాంగ్రెస్ ను వీడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఉదాహరించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ రాజకీయ కురువృద్ధుడు అయినప్పటకీ ఆయన ఇప్పుడు జగన్ లా చేయాలని జాతీయ స్థాయిలో మీడియా సూచిస్తూ ఉంది! ఢిల్లీకి పక్కనే ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ లో రాజకీయ మంట రేగిన వైనంతో 12 యేళ్ల కిందట జగన్ తో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును జాతీయ మీడియా ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంది.
కాంగ్రెస్ పార్టీకి అఖండమెజారిటీని సంపాదించి పెట్టిన వైఎస్ ఇమేజ్ ను పట్టించుకోకుండా.. వైఎస్ఆర్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం.. వైఎస్ జగన్ ను తక్కువ అంచనా వేయడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ సున్నా సీట్లకు, నోటా కన్నా తక్కువ ఓట్లకు పరిమితం కావడాన్ని జాతీయ మీడియా ఇప్పుడు జాతికి వివరిస్తూ ఉంది!
వైఎస్ఆర్ బతికి ఉన్నన్ని రోజులూ.. ఆయనను అధిష్టానం ఎలా చూసినా, ఆయన భరించారు. సోనియాకు అపరవిధేయుడుగా వ్యవహరించారు. రెండు సార్లు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన ఎంపీ సీట్లలో సింహభాగాన్ని ఏపీ నుంచినే అందించింది వైఎస్ నాయకత్వం. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం.. ఇదేమీ అర్థం కాలేదు. వైఎస్ మరణాంతరం జగన్ ను సీఎం చేయాలంటూ.. నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారు. వాళ్లేమీ అమాయకులు కాదు, అర్బకులు కాదు.
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అనుకూలంగా సంతకాలు చేసింది. ఆ మెజారిటీ కి అనుగుణంగా అధిష్టానం అప్పుడే జగన్ ను సీఎం చేసి ఉంటే కథ ఎలా ఉండేదో కానీ, ఆ సమయంలో జగన్ ను అన్ని రకాలుగానూ నిర్లక్ష్యం చేయడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తగు మూల్యాన్ని చెల్లించింది. ముఖ్యమంత్రి పదవిని జగన్ కోరే ఉండవచ్చు. దానికి సోనియా నిరాకరించే ఉండవచ్చు. అయితే… జగన్ ను దూరం చేసుకుంది కాంగ్రెస్ హై కమాండ్.
అంతటితో కూడా ఆగలేదు. ఓదార్పు యాత్రకు అడ్డుపుల్ల వేసింది. నువ్వు నాయకుడిగా ఎదుగుతానంటే ఒప్పుకోనంది. ఎదిగేది మన పార్టీ వాడే కదా.. జగన్ ప్రజల్లోకి వెళితే.. కాంగ్రెస్ కే కదా.. లాభం అనే ఇంగితజ్ఞానం కాంగ్రెస్ హైకమాండ్ కు లేకపోయింది. ఆ పరామర్శకు కూడా అడ్డు తెర వేసే ప్రయత్నం చేసింది. ఆ పరిణామాల్లో జగన్ తిరుగుబాటు తప్పలేదు.
అయితే తొలి అడుగులోనే జగన్ చాలా నైతికంగా వ్యవహరిస్తూ వచ్చాడు. అదే అతడి శక్తిని పెంచింది. కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేశాడు, కాంగ్రెస్ ద్వారా తన తల్లికి వచ్చిన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయించారు. ఉప ఎన్నికలకు రెడీ అయ్యారు. సంచలన విజయంతో ఆదిలోనే సత్తా చూపించారు. ఆ తర్వాత తన వెంట నిలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించి, ధైర్యంగా ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ ఉప ఎన్నికలకు కాంగ్రెస్, నాటి ప్రతిపక్షం టీడీపీ భయపడింది కానీ, జగన్ పార్టీ కాదు.
అక్కడ నుంచి జగన్ పై కాంగ్రెస్ మార్కు కక్ష సాధింపు చర్యలు మొదలు. జగన్ ను అవినీతి పరుడుగా చూపించి, జైలుకు పంపారు. 16 నెలల పాటు జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని విడదీశారు. జగన్ ను అణగదొక్కడం అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషరాజకీయాన్ని అంతా ప్రదర్శించింది. అందుకు అన్ని రకాలుగానూ ఎదురుదెబ్బలు తింది. జగన్ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏపీని విడదీసింది. అలా చేసి తెలంగాణలో మూటగట్టుకున్నది ఏమీ లేదు. జగన్ ధాటికి ఏపీలో చిత్తు అయ్యింది. 2014లో జీరో అయ్యింది. 2019లో నోటా కన్నా తక్కువ ఓట్లను మిగుల్చుకుంది!
ఇదంతా కేవలం జగన్ ను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా. ప్రజల్లో ఉండాలన్నా తన తండ్రి వలే పేరు తెచ్చుకోవాలన్నా జగన్ కోరికకు ఆ రోజు సోనియాగాంధీ మద్దతుగా నిలిచి ఉంటే? జగన్ ను ప్రోత్సహించి ఉంటే వైఎస్ కన్నా విలువైన విధేయుడు జగన్ రూపంలో ఆమెకు లభించేవాడు!
జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకుని ఉండకపోతే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఒక రేంజ్ లో ఉండేది ఇప్పుడు కూడా! చెప్పుడు మాటలు, చేతగాని వారి మాటలు వింటూ.. సోనియాగాంధీ అలా ఏపీలో తన పార్టీని తాను దెబ్బతీసుకుందని, సోనియా చేతిలో అధికారం ఉందని తెలిసి కూడా.. దేన్నైనా ఎదుర్కొనగల ధీమాతో బయటకు నడిచిన జగన్ సిసలైన పొలిటికల్ హీరో అని జాతీయ మీడియా ఇప్పుడు కీర్తిస్తూ ఉంది.
ఇక జాతీయ మీడియా ప్రస్తావిస్తున్న రెండో ఉదంతం హిమంత బిశ్వర్మది. 2015లో అస్సాం కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి బీజేపీని గెలిపించిన నేత ఇతడు. ఆ సమయంలో అస్సాంలో కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 78. అప్పటికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఏడాదే అవుతోంది. ఇంకా రాహుల్ కు తమ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు అయినా! అస్సాం కాంగ్రెస్ కు సంబంధించి అర్జెంటుగా తేల్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని, ఆ మూడో టర్మ్ ఎమ్మెల్యే రాహుల్ అపాయింట్ మెంట్ ఎలాగో సంపాదించాడు.
అపాయింట్ మెంట్ అయితే దక్కింది కానీ, తనకు కేటాయించిన కొద్ది సమయంలో కూడా తను చెప్పింది వినకుండా రాహుల్ గాంధీ తన కుక్కతో ఆడుకున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ మరోవైపు తన పెంపుడు కుక్కతో ఆటాడాడు రాహుల్. ఇదీ ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు రాహుల్ ఇచ్చిన ఘనమర్యాద. ఆ సమావేశంతో కాంగ్రెస్ లో తన విలువ ఏమిటో హిమంతకు బోధపడింది. ఆ తర్వాతి సంవత్సరమే అస్సాం ఎన్నికలు. బీజేపీలో చేరిపోయిన హిమంత ఆ పార్టీ విజయంలో కీలక పాత్రను పోషించాడు.
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ చిత్తయిన అనంతరం వచ్చిన వార్తల్లో హిమంత-రాహుల్ సమావేశం బాగా హైలెట్ అయ్యింది. పార్టీ నేతల ప్రాధాన్యత ఏమిటో కాంగ్రెస్ కు ఇంకా అర్థం కాలేదని ఆ ఉదంతం చాటి చెప్పింది!
నేడో .. రేపో.. కెప్టెన్ దీ అదే దారే?
2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ సామర్థ్యం, నాయకత్వం బాగా హైలెట్ అయ్యింది. అప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఓడటమే కాదు.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు పరువు పోతోంది. అలాంటి సమయంలో అమరీందర్ నాయకత్వం లో పంజాబ్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కథ దేశంలో ఇంకా అయిపోలేదనే సందేశాన్ని ఇచ్చింది నాటి పంజాబ్ విజయం.
మరి మళ్లీ ఇప్పుడు పంజాబ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో.. నాడు కాంగ్రెస్ ను గెలిపించిన నేతగా కీర్తనలు పొందిన అమరీందర్, కాంగ్రెస్ ను వీడుతున్నట్టుగా ప్రకటించారు! కారణాలు ఏవైనా కావొచ్చు.. కాంగ్రెస్ ను ఒక రాష్ట్రంలో గెలిపించిన మరో నేత కాంగ్రెస్ ను వీడుతున్నారు. అధికారం ఉన్నదే అరకొర రాష్ట్రాల్లో. అలాంటి చోట కూడా కాంగ్రెస్ హైకమాండ్ కీలక నేతలను సాగనంపడానికి వెనుకాడటం లేదు! ఇప్పుడు అమరీందర్ కూడా జగన్, హిమంత వంటి వాళ్ల దారిలో నడిస్తే కాంగ్రెస్ ను పంజాబ్ లో గట్టి దెబ్బే కొట్టగలడు.
సోనియాగాంధీ చేతిలో ఇప్పుడు అధికారం లేదు. కాబట్టి.. హిమంత, అమరీందర్ లాంటి వాళ్లు ఢీ అనగలరు. సోనియా చేతిలో అధికారం ఉన్నప్పుడే, కాంగ్రెస్ ను వీడితే తనను ఏమైనా చేయగలరు అని తెలిసినప్పుడే జగన్ ఢీ కొట్టాడు. అందుకే జగన్ ధిక్కారస్వరానికి అగ్రతాంబూలం దక్కుతోంది. ఈ సాహసం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. ది జగన్ చాప్టర్ గా జాతీయ మీడియా పుష్కరకాల ఏపీ రాజకీయ ప్రస్థానాన్ని హైలెట్ చేస్తోంది.