కన్యాశుల్కం రామాయణం ఒక్కటే…గురజాడ అవార్డుకు చాగంటి అర్హుడే….

సాహిత్యం అయినా ప్రవచనం అయినా సమాజంలో రుగ్మతలను పారదోలడమే లక్ష్యం. ఆ విధంగా చూసుకుంటే గురజాడ అప్పారావు గారు ఇప్పటికి నూటాభై ఏళ్ల క్రితం అక్షర సమరం చేశారు. తన కలాన్నే కత్తిగా మార్చి…

సాహిత్యం అయినా ప్రవచనం అయినా సమాజంలో రుగ్మతలను పారదోలడమే లక్ష్యం. ఆ విధంగా చూసుకుంటే గురజాడ అప్పారావు గారు ఇప్పటికి నూటాభై ఏళ్ల క్రితం అక్షర సమరం చేశారు. తన కలాన్నే కత్తిగా మార్చి సమాజ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 

ఆధునిక కాలంలో చాగంటి కోటేశ్వరరావు లాంటి ప్రవచనకారులు సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద తమదైన శైలిలో ప్రవచనాలు చెబుతూ వస్తున్నారు. దారులు వేరైనా ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినపుడు చాగంటి వారికి గురజాడ అవార్డు ఇవ్వడంలో తప్పేముంది అని వాదించే వారు ఉన్నారు.

అందుకే విజయనగరంలో వైభవంగా జరిగిన గురజాడ అప్పారావు సాహితీ అవార్డు ప్రదాన కార్యక్రమానికి సతీసమేతంగా విచ్చేసి మరీ చాగంటి వారు ఒక గర్వంగా గౌరవంగా అవార్డు అందుకున్నారు. తనకు గురజాడ సాహితీ అవార్డు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చాగంటి వారు సైతం గురజాడ గొప్పతనాన్ని కీర్తించారు. ఆయన ఆనాటి సామాజిక సమస్యల మీద పోరాడారు. తన దృష్టిలో వాల్మీకి అంతటి గొప్పవారు గురజాడ వారు అని కొనియాడారు.  

దీని అర్ధం కన్యాశుల్కం రామాయణం ఒక్కటే అని చెప్పడమే. అక్కడా ఇక్కడా చెడు మీద పోరాటం అయినపుడు తేడా ఏముంది అన్నదే ఆయన చెప్పిన మాటల అంతరార్ధం. చాగంటి వారికి గురజాడ అవార్డు ఇస్తున్నారు అన్న వార్త రాగానే రచయితలు, సాహితీవేత్తలు చాలా మంది పెద్ద ఎత్తున విజయనగరంలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేశారు. నిరసనలు తెలిపారు. కానీ తాను ఈ అవార్డు తీసుకోవడం అదృష్టమని చాగంటి వారు అన్నారు. ఆయనకు ఈ అవార్డు దక్కడం నూరు శాతం న్యాయమని ఇచ్చిన వారు సభకు వచ్చిన వారూ అన్నారు.

కాదేదీ కవితకు అనర్ఘం అని మహా కవి శ్రీశ్రీ అన్నారు. సమాజంలోని పెడ ధోరణులను దునుమాడేందుకు కాదేదీ మార్గమని చాగంటి అయినా మరొకరు అయినా రుజువు చేస్తున్నారు. చాగంటిని సనాతనవాదిగా ముద్ర వేస్తున్న వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన మంచి గురించి మాత్రమే చెబుతున్నారు. తీసుకునే వారు తీసుకుంటున్నారు లేని వారు లేదు. ఒక ప్రవచకారుడిగా ఆయన సమాజ హితైషిగా ఉన్నారు. కవులు అయినా చేసేది అదే. 

అందువల్ల గురజాడ అవార్డు చాగంటి వారికి ఇవ్వవద్దు అని ఎన్ని వత్తిళ్ళు వచ్చినా గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య పెద్దలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇంత వివాదం అవుతోంది తనకు అవార్డు వద్దు అని చాగంటి వారు అనలేదు. ఎందుకంటే గురజాడ అవార్డుకు చాగంటి వారు వేయి రెట్లు అర్హులు కాబట్టి. అందుకే సభ సాఫీగా విజయవంతంగా సాగింది. వివాదం అలా మరుగు అయింది.