ఇదే ఏపీ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చర్య తీసుకుని వుంటే మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నెన్ని తిట్లు తిట్టేవారో ఊహించుకోవచ్చు. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు ఇతర టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేవారు. కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని, తమపై కేసులు పెట్టే అధికారుల పేర్లన్నీ డైరీల్లో రాసుకుంటున్నామని, తమ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కరి అంతు చూస్తామని హెచ్చరించేవారు.
కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన ఈడీ కేసు చర్యలు తీసుకున్నప్పటికీ స్వయంగా జేసీ ప్రభాకర్‌రెడ్డే ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితి. జేసీ ప్రభాకర్‌రెడ్డిలో మొదటిసారి పిరికితనాన్ని, భయాన్ని చూస్తున్నామని జనం అభిప్రాయపడుతున్నారు.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జేసీ బ్రదర్ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ లిమిటెడ్, అలాగే ఆయన బిజినెస్ పార్టనర్ గోపాల్‌రెడ్డి కంపెనీలకు చెందిన చర, స్థిర ఆస్తులు రూ.22.10 కోట్లను జప్తు చేస్తున్నట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఇవాళ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.
ఈడీ విచారణ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. అలాగే ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీని దేవుడిగా ఆయన అభివర్ణించడం విశేషం. జేసీ బ్రదర్ తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీని దెయ్యంగా ఆయన విమర్శిస్తారని ప్రత్యర్థులు అనుకున్నారు. కానీ అలా అనకపోవడానికి ప్రధాన కారణం… ఈడీ అంటే భయం వల్లే అని అంటున్నారు.
‘నాకు ఈడీ రూపంలోనే దేవుడు ఉన్నాడు. మాకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ను విచారణ చేయలేదు. నాగాలాండ్ అధికారులను ఎంక్వైరీ చేయాలి. ఈ కేసులో ఆర్టీఓ, పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారు. ఇందులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్.. వారిని ముందు విచారణ చేయాలి’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేయడం గమనార్హం. తనతో పాటు సహకరించిన అధికారులు, ప్రైవేట్ సంస్థలు ఇరుక్కోవాల్సి వస్తుందని ఆయన సంతోషిస్తున్నట్టుగా వుంది. వాళ్ల కోసమైనా తనను నిర్దోషిగా ప్రకటిస్తారనే ఆశ ఆయనలో ఏ మూలో ఉన్నట్టు అర్థమవుతోంది.