వైసీపీలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరుతారనే వార్తలు…జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆయన చేరలేదు. మరోవైపు టీడీపీలో గంటా యాక్టీవ్‌గా కూడా లేరు. దీంతో గంటా పరిస్థితి ఇటు వైసీపీలో చేరక, అటు టీడీపీలో కొనసాగలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టైంది.
వైసీపీలో గంటా చేరికకు సంబంధించిన సమాచారాన్ని ఎల్లో మీడియాలో ప్రధానంగా ఇస్తుండడంతో ఈ సారైనా ఆ ప్రచారం నిజమవుతుందా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. సీఎం జగన్ సన్నిహితులతో గంటా శ్రీనివాసరావు చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానంగా గంటా చేరికను అడ్డుకుం టున్నట్టు వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
విజయసాయిరెడ్డిని కాదని గంటా చేరే అవకాశం ఉందా? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి, ఆ తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న అవంతి శ్రీనివాస్ కూడా గంటా రాకను అడ్డుకుంటు న్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీలో గంటా చేరినా…మనుగడ సాగిస్తారా అనేది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది.
వచ్చే నెల రెండో వారంలో జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే చేరిక అంటే గంటా శ్రీనివాసరావు మెడలో కండువా వేయడం లాంటివి ఉండవని తెలిసిందే. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరుణం బలరాంతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించినట్టుగానే గంటాకు కూడా అదే విధమైన ఏర్పాట్లు చేస్తారు.