ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరు ఈడీ చేర్చడంపై తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ఇది బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తనను జైల్లో పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చని ఆమె సంచలన వ్యాఖ్య చేశారు.
ప్రజల కోసం పనిచేయడం మానుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం పని చేస్తున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆమె వాపోయారు. దర్యాప్తు సంస్థలు వస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. కేసులకు సంబంధించి మీడియాకు లీకులిచ్చి మంచి పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పి కొడతారని మోడీకి హితవు పలికారు.
మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోందన్నారు. ఈ పాలనా కాలంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్ను కున్న ప్రభుత్వాల్ని పడగొట్టారని విమర్శించారు. బీజేపీ అడ్డగోలుగా అధికారంలోకి రావడాన్ని మనమంతా గమనిస్తున్నట్టు ఆమె చెప్పారు. అలాగే ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ఏడాది ముందు మోడీ కంటే ఈడీ వెళుతోందన్నారు. ఇది కొత్త విషయం కాదన్నారు.
తెలంగాణలో వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలున్న నేపథ్యంలో మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని కవిత విమర్శించారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన ఎత్తగడగా ఆమె అభివర్ణించారు. దాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన, తికమకపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. గౌరవనీయులైన పెద్దలు మోడీ తన పంధాను మార్చుకోవాలని ఆమె కోరారు.
అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో ఈడీ, సీబీఐలతో గెలవాలని అనుకుంటే అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అది కాదు, కూడదంటూ జైల్లో పెడ్తామంటే… పెట్టుకోవాలని, ఏమవుతుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలు తమ వెంట ఉన్నంత కాలం, చిత్తశుద్ధితో వారి కోసం పని చేస్తున్నప్పుడు ఏమీ కాదన్నారు.