కరకట్టపై తన ఇల్లును కూల్చేస్తున్నారంటూ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. చంద్రబాబు వరసకు తనకు అల్లుడు అవుతాడని, నిజంగా ఆయన బీద స్థితిలో ఉంటే ఓ అత్తగా చంద్రబాబుకు ఇల్లు కట్టి ఇవ్వడానికు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇకనైనా అల్లుడుగారు బీద అరుపులు మానుకోవాలని సూచించారు.
“పాపం.. చంద్రబాబుకు ఏం లేదని టీడీపీ నేతలు ఏడుస్తున్నారు. నాక్కూడా జాలేసింది. ఎంతైనా నాకు అల్లుడు కదా. బాబుకు ఏమీ లేదేమో అనుకున్నాను. నా అల్లుడు ఏమీ సంపాదించుకోలేకపోయాడని అనుకున్నాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను.. చంద్రబాబు తనకు ఏమీలేదని ఒప్పుకుంటే, అమరావతిలో ఇల్లు కట్టించి ఇవ్వడానికి అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను. నా స్తోమత 200 గజాలు మాత్రమే, అది కూడా మా వైసీపీ వాళ్లమంతా చందాలు వేసుకొని ఆ ఇల్లు కడతాం. మరీ కడుపేద స్థితిలో ఉంటే నాకు చెప్పు బాబు. నేను ఇల్లు కట్టి ఇస్తా.”
కరకట్ట మీద ఇల్లు పోతే చంద్రబాబుకు ఎందుకంత ఏడుస్తున్నారో తనకు అర్థంకావడం లేదన్నారు లక్ష్మీపార్వతి. కరకట్ట ఇల్లు తనకు వారసత్వంగా వచ్చినట్టు బాబు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. తన ఇల్లు కూల్చేశారని ఏడుస్తున్న బాబు ఆ ఇంట్లో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్లు దాచారా లేక బినామీలకు చెందిన పత్రాలేమైనా దాచారా అని ప్రశ్నించారు. మరోవైపు బాబు జీవితం అంతా శవరాజకీయాలతోనే సరిపోయిందని ఆరోపించారు లక్ష్మీపార్వతి.
“ఎన్టీఆర్ నుంచి కోడెల వరకు బాబుది ఒకటే రాజకీయం. అదే శవ రాజకీయం. నువ్వు ఏడ్చే ఏడుపంతా శవ రాజకీయమే. నిన్నటి వరకు నువ్వు పెంచి పోషించిన ఓ అక్రమ కుటుంబాన్ని నాశనం చేశావు. నీ కారణంగా కోడెల చనిపోతే, ఆ శవాన్ని హైదరాబాద్ నుంచి నర్సారావుపేట తీసుకొస్తూ ఎక్కడపడితే అక్కడ ఆపుతావా. కోడెల చనిపోవడానికి ముందు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు, మొన్న అదే మృతదేహంతో రాజకీయాలు చేశారు. ఎన్టీఆర్ గారి దగ్గర్నుంచి నేను చూస్తూనే ఉన్నాను. బాబుది ఇదే తరహా రాజకీయం.”
జగన్ సంక్షేమ పాలన అందిస్తుంటే.. చంద్రబాబు మాత్రం చీప్ పబ్లిసిటీ కోసం నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు ఆస్కార్ ఇవ్వాలని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారని, ఇప్పుడు తను కూడా అదేమాట అంటున్నానని అన్నారు లక్ష్మీపార్వతి.