రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ షర్మిల పేరు మార్మోగుతోంది. మంచో, చెడో తన పేరు చర్చనీయాంశం కావాలని షర్మిల పరితపిస్తున్నారు. ఆమె కోరుకున్నట్టుగానే తెలంగాణ రాజకీయాలను తన వైపు తిప్పుకోగలిగారు. షర్మిల పాదయాత్రలో వాహనాల ధ్వంసం, బ్యానర్లకు నిప్పు పెట్టడం మొదలు హైదరాబాద్‌లో ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం హైలెట్‌గా నిలిచింది.
మరీ ముఖ్యంగా కారులో ఆమె వుండగానే పోలీసులు క్రేన్ సాయంతో స్టేషన్‌కు తరలించడం మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి కోర్టుకెళ్లడం, బెయిల్ రావడం వరకూ షర్మిల చుట్టూ రాజకీయాలు పరిభ్రమించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పవన్ రాజకీయాలపై పెద్ద ఎత్తున సెటైర్స్ వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీగా నిరసనలు ఎలా చేయాలో షర్మిలను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు హితవు చెప్పారు.
ఒక మహిళ ఏ మాత్రం అవకాశం లేని చోట వీరోచిత పోరాటం చేస్తోందని, ఇదే ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది అనుచర, అభిమానం వున్న పవన్‌కల్యాణ్ మాత్రం వీకెండ్ పాలిటిక్స్‌కు పరిమితం అయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. అదేంటో గానీ మరో ప్రతిపక్ష యువనాయుకుడిని ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలో పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్‌ను జనం ఒక నాయకుడిగా గుర్తించకపోవడం వల్లే షర్మిల ఎపిసోడ్లో పవన్‌ను మాత్రమే టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
షర్మిల మాదిరిగా ప్రతిపక్ష పాత్రలో ఒక్క రోజైనా పోరాటం చేశావా లోకేశ్ అని ప్రశ్నించి వుంటే బాగుండేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. షర్మిలతో పోల్చుతూ పవన్‌ను విమర్శించినప్పటికీ, ఆయన్ను గుర్తించడం వల్లే అలా జరుగుతోందనే అభిప్రాయం వెల్లడవుతోంది. పాజిటివ్ లేదా నెగెటివ్ ఏదైనా… లోకేశ్‌పై వ్యక్తమై వుంటే, ఆయన ఉనికిని గుర్తిస్తారని ఆనందించే వాళ్లమని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. భవిష్యత్‌లో లోకేశ్ పాదయాత్రపై జనం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.