మొత్తానికి షర్మిల తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనాలు పుట్టిస్తున్నారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత, ఆమె గురించి ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వారు మాట్లాడుతున్నది కూడా.. ఆమె ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ రాజకీయాలలో పనిచేస్తున్నదోనని నిందలు వేయడానికి మాత్రమే. ఆమె పాదయాత్ర గురించి గానీ, ఆమె స్వచ్ఛంగా ప్రజా ప్రయోజనాల కోసం తెలంగాణ రాజకీయాలలో పనిచేస్తున్నదని గానీ, ఎవ్వరూ మాటమాత్రంగా నైనా అనడం లేదు. అనుకోవడం లేదు.
తెలంగాణలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు కనపడుతున్నాయి. ఎవరికి వారు తమని నష్టపరచడానికి ఎదుటి పార్టీ ప్రయోగించిన అస్త్రం షర్మిల అంటూ ఆమెకు ప్రయోజనాలు ఆపాదిస్తూ ఉండడమే తమాషా. ఇన్నాళ్ళూ ఆమె యాత్రను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అరెస్టులు వాటికి సంబంధించి జరిగిన రభస ఇవన్నీ నిజమే కానీ మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హాట్ టాపిక్ గా మారారనేది స్పష్టం.
కాంగ్రెస్ ఓట్లను దెబ్బ కొట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారనేది ఆ పార్టీ వారి వాదన ఆమె టిఆర్ఎస్ ప్రయోగించిన బాణం అనేది వారి నింద. షర్మిల పాదయాత్ర చేస్తే లేదా, ఆమె వైయస్సార్ పేరు మీద స్థాపించిన పార్టీ తెలంగాణలో ఏ కొంతైనా బలపడితే కచ్చితంగా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది వైఎస్ఆర్ ను అభిమానించే, ఆయన పేరు కోసం ఓట్లు వేసేవాళ్లు సహజంగా కాంగ్రెస్ ఓటర్లే అయి ఉంటారనేది ఒక అంచనా. ఆ రకంగా కాంగ్రెసుకు నష్టం జరగడం గ్యారెంటీ. ఆ నేపథ్యంలోనే తమ పార్టీని దెబ్బ కొట్టడానికి కేసీఆర్ ప్రయోగించిన బాణం షర్మిల అని వాళ్ళు నిందలు వేస్తున్నారు.
మరోవైపు గులాబీ తనయ కల్వకుంట్ల కవిత షర్మిల ట్వీట్ల సమరంలో తలపడ్డారు ఆ క్రమంలో భాగంగా ‘కమల బాణం షర్మిల’ అని కవిత నిందించడం గమనార్హం. షర్మిల తానా అంటే బిజెపి తందానా అంటుందని భారతీయ జనతా పార్టీ ప్రయోగించిన బాణమే షర్మిల అని కవిత నిందలు వేశారు
వీరందరిదీ ఒకెత్తు అయితే.. టీరాజకీయాల్లో ఎలా ఏం జరిగినప్పటికీ షర్మిల పార్టీ అనూహ్యంగా బలపడి సొంతంగా సీట్లు గెలిచే స్థాయికి వస్తే తప్ప ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉండడం వలన, ఓ మోస్తరు బలాన్ని పొందడం వలన అంతిమంగా మేలు జరిగేది కేసీఆర్ కు మాత్రమే. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి మాత్రమే షర్మిల ఉపయోగపడుతుంది తప్ప, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదు’ అనేది విశ్లేషకులు అంచనా.
ఆ కోణంలోంచి చూసినప్పుడు టిఆర్ఎస్ కు ప్రయోజనం కలిగించే తరహాలో కమలం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు బాణాలను ప్రయోగిస్తాయి అనే అనుమానం మనకు కలుగుతుంది. మొత్తానికి తాజా ఎపిసోడ్ తో ఇన్నాళ్లూ షర్మిలను విస్మరించినట్లుగా నటించిన నాయకులందరూ కూడా ఇప్పుడు ఆమె రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇది ఆమె పార్టీకి శుభపరిణామం.