నిన్న దేబిరింపు.. ఇవాళ బెదిరింపు.. వారెవ్వా బాబూ!

అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబునాయుడు! ఆయన నలభై నాలుగేళ్ల రాజకీయ చరిత్రలో అలాంటి ఉదాహరణలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇటీవలి పరిణామాల్లోనే నరేంద్రమోడీ కాళ్లు పట్టుకుని 2014 లో అధికారంలోకి…

అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబునాయుడు! ఆయన నలభై నాలుగేళ్ల రాజకీయ చరిత్రలో అలాంటి ఉదాహరణలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇటీవలి పరిణామాల్లోనే నరేంద్రమోడీ కాళ్లు పట్టుకుని 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తన చేతగానితనాన్ని ఆ పార్టీ మీదకు నెట్టేయడానికి 2019కెల్లా అదే మోడీపై ఎన్ని రకాల నిందలు వేశారో అందరూ చూశారు. ఆయన మాటమార్చే తరహా ఎవ్వరికీ తెలియనిది కాదు. తాజాగా ప్రజలతో కూడా అదే చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.

ఎలాగైనా సరే.. 2024లో అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న చంద్రబాబునాయుడు అందుకోసం ప్రజల వద్దకు వెళ్లి.. ముసలివాడినైపోయాను, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి రాజకీయాల్లో ఉంటానో లేదో.. ఇదే నాకు లాస్ట్ చాన్స్.. దయచేసి చాన్స్ ఇవ్వండి.. నన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి అంటూ దేబిరించారు.

అలా ప్రజలను దేబిరించి వాళ్ల ఎదుట కన్నీళ్లు పెట్టుకుంటే తనకు ఓట్లు గంపగుత్తగా పడిపోతాయని ఆయన ఆలోచన సానుభూతి వెల్లువెత్తుతుందని కోరిక. ఆ దురాలోచనతో ప్రతి మీటింగులోనూ నాకు లాస్ట్ చాన్స్ ఇవ్వండి అని చెప్పుకుంటూ తిరిగారు.

జగన్మోహన్ రెడ్డి ఒక్కచాన్స్ అనే మాట వర్కవుట్ అయినట్టుగా తనకు లాస్ట్ చాన్స్ మాట వర్కవుట్ అవుతుందని అనుకున్నారు. కానీ రెండు రోజులు గడిచేసరికి ఆ నినాదం బ్యాక్ ఫైర్ అయిందని అర్థమైంది. ఆయనకు లాస్ట్ చాన్స్ ఇవ్వాలనే విషయం ప్రజలకు అర్థం కాలేదు. ఆయనకు వయసైపోయింది.. ముసలితనం వచ్చేసింది.. ఆయన చేతిలో అధికారం పెడితే కష్టం..  అనే పార్ట్ మాత్రమే వారికి అర్థమైంది. అందుకే తాజాగా మాట మార్చారు.

లాస్ట్ చాన్స్ అనేది తనకు కాదట.. రాష్ట్రానికి లాస్ట్ చాన్స్ అట. ఇప్పుడు గనుక ఆయనను గెలిపించి ఆయన చేతిలో అధికారం పెట్టకపోతే.. అభివృద్ధిని చూడడానికి ప్రజలకు మళ్లీ అవకాశం దక్కదట. ఆ రకంగా రాష్ట్రానికి ఇదే లాస్ట్ చాన్స్ అట. అంటే ఇంచు మించుగా.. ఇప్పుడు తాను ఓడిపోతే గనుక.. ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ గెలుస్తూనే ఉంటాడు.. ఎప్పటికీ ఆయనే సీఎంగా ఉంటాడు.. అని చంద్రబాబునాయుడు కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంది. ఆ భయంతోనే మీకు లాస్ట్ ఛాన్స్ అని బెదిరించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు.

సంక్షేమం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు గానీ, జగన్ గానీ నిర్వచనాలు చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ప్రజలు తాము తేల్చుకోగలరు. నిర్ణయించుకోగలరు. అభివృద్ధి చేస్తున్నారని నమ్మితేనే ఏ ప్రభుత్వాన్నయినా రెండోసారి గెలిపిస్తారు. నిన్నటిదాకా నాకు లాస్ట్ చాన్స్ అని దేబిరించి, ఇవాళ మీకే లాస్ట్ చాన్స్ అని బెదిరించినంత మాత్రాన చంద్రబాబు మాటలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.