మంచి మనిషి అని చెప్పడానికి ప్రామాణికాలు కొలిచినట్టుగా ఏమీ ఉండకపోవచ్చు. మంచితనం అనేది మనిషి మనిషి దృష్టిలోనూ మారిపోవచ్చు! తన అంతటి మంచి వాడు మరొకడు ఉండటంటూ ఏ మనిషి అయినా చెప్పుకుంటాడు! అయితే రిలేషన్ షిప్స్ విషయంలో ఎవరి మంచితనం ఏమిటో మరొకరు అస్సలు అర్థం చేసుకోలేరు.
ఇతరుల దాంపత్యం గురించి పరిశీలించినా, ఎవరి దాంపత్యం గురించి వారే ఆలోచించి చూసినా.. మంచితనం ఏమిటనేది అంత తేలికగా అర్థం చేసుకోలేని అంశమే! ఇలాంటి పరిస్థితుల మధ్యన.. స్త్రీతో బంధంలో ఉన్న మగవాడి మంచితనానికి కొన్ని ప్రామాణికాలున్నాయని అంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. మంచి మగవాడు కలిగి ఉండే లక్షణాలు ఏమిటో, కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో వారు వివరించి చెబుతూ ఉన్నారు. మరి మగవాడిని మంచి వాడు అనడానికి ఉన్న ప్రామాణికాలు ఏమిటో ఒక సారి తరచి చూస్తే..!
లుక్స్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడు!
కారణాలు ఏవైనా ఒక స్త్రీతో బంధంలో మునిగాకా ఆమె లుక్స్ గురించి కామెంట్లు చేయడు సరైన మగవాడు. రూపం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అందంగా ఉన్నరనిపించుకున్న వాళ్లు పెళ్లైన రెండు మూడేళ్లకే షేప్ మొత్తం మారిపోయి ముందులా కితాబులు అందుకోలేకపోవచ్చు! ఇది ప్రకృతి సహజం. మరి అందం గురించి నెగిటివ్ కామెంట్లు, కించపరిచేలా, హర్ట్ చేసేలా మాట్లాడటం కచ్చితంగా మంచి మగాడి లక్షణం కాదు. అందం ప్రస్తావన తీసుకు వచ్చినా, తీసుకురాకపోయినా.. పాజిటివ్ టోన్ లో కాకుండా నెగిటివ్ గా స్పందించేవాడు, ఈ విషయంలో అవతలి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా స్పందించడం చెడు లక్షణం.
ప్రైవసీకి విలువనిస్తాడు!
చాలా మంది అమ్మాయిలు కోరుకునేది ఇదే. తన బాయ్ ఫ్రెండ్ లేదా భర్త తన ప్రైవసీకి విలువను ఇవ్వాలని, తన వ్యక్తిగత ఆలోచనలు, అభిరుచులనూ ఖాతరు చేయాలని కోరుకోని అమ్మాయంటూ ఉండదు. మరి నిఖార్సైన మగతనం ఇలాంటి ప్రైవసీని ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేకించి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించడం, ఆమె చాట్స్ అన్నింటినీ చదివేయడం, ఆమె ఫోన్ ను క్షుణంగా పరిశీలించడం.. ఇవన్నీ కూడా అంత మంచి అలవాట్లు కావు. ఆఖరికి ఆమెతన ఇంట్లో వాళ్లతో ఏం మాట్లాడుతోందో, ఏం చాట్ చేస్తోందో కూడా తెలుసుకోవడానికి ఉబలాటపడే మగాళ్లకు లోటు లేదు. ఇది నిజంగా మంచి లక్షణం కాదు.
నిరుత్సాహ పరచడు!
కుటుంబ వ్యవహారంలో అయినా, ఆమె వృత్తిగత అంశం గురించి అయినా.. మంచి మగవాడు ఎప్పుడూ తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ను నిరుత్సాహ పరచడు. ఆమెకు వీలైనంత సపోర్ట్ గా నిలుస్తాడు. డిస్కరేజ్ చేయకుండా, ఎంకరేజ్ చేస్తూ.. కఠినమైన సందర్భాల్లో వెంట నిలబడతాడు.
ఆమె విలువను గుర్తిస్తాడు!
ఆమె తన వెంట లేకపోతే ఉంటే లోటును అతడు తేలికగా గుర్తించగలడు. ఆమె వల్ల ఉన్న జీవితం సాఫీగా సాగుతున్న తీరును మనసులో ఉంచుకుంటాడు. వ్యవహరణ తీరులో దాన్ని పదే పదే బయటపడేలా చేయకపోయినా, తన మనసులో అయితే మంచి స్థానాన్ని ఇచ్చి దాంపత్యాన్ని, బంధాన్ని కొనసాగిస్తాడు.
సెకెండ్ ఆప్షన్ గా పెట్టుకోడు!
ఈ విషయంలో అయినా.. భార్యను రెండో ఆప్షన్ తరహాలో వ్యవహరించే తత్వం మంచి మగాడిది కాదు. మొదటి ఆప్షన్ ఆమే. రెండో ఆప్షన్ ఉంటుందా? అనే చర్చ కన్నా.. భార్యనే మొదటి ఆప్షన్ గా పెట్టుకోవడం మంచి మగతనం.
కీలకమైన చర్చల్లో భాగస్వామి!
కుటుంబానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నిస్సందేహంగా భార్యను కీలక భాగస్వామిగా పరిగణిస్తాడు. ఆమె అభిప్రాయాలను కూడా తీసుకుని నిర్ణయాలను తీసుకోవడం, సమీక్షించుకోవడం మంచి మగాడి తీరు.