తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్నపోరు ఒక్కసారిగా టీఆర్ఎస్ వర్సెస్ వైఎస్ షర్మిలాగా మారిపోయింది. నిన్నటివరకు ఎవరూ పట్టించుకోని షర్మిల ఇప్పుడు అందరికీ ముఖ్యంగా టీఆర్ఎస్ తో, వ్యక్తిగతంగా కేసీఆర్ తో పోరాడుతున్న బీజేపీకి వీరనారిలా కనబడుతోంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. షర్మిల తెలంగాణలో అడుగు పెట్టిన తొలిరోజుల్లో ఆమెను కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లైట్ తీసుకున్నాయి. ఆమెను తెలంగాణలోకి రప్పించింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ, కాదు బీజేపీయే రప్పించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు చీల్చడానికి కేసీఆరే ఆమెను రప్పించాడని రెండు పార్టీలు దుయ్యబట్టాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అన్ని పార్టీల దృష్టి షర్మిల మీద పడింది.
షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో పార్టీ స్థాపించిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయారు. ఇప్పటికే 3,500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసారు. నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలు చేసినా మైలేజ్ దక్కలేదు. టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కొంత కాలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్రలో ఆ వ్యాఖ్యలే ఆమె రాజకీయ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పాయి. విచిత్రమేమిటంటే షర్మిల కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. 3500 కిలో మీటర్ల పాదయాత్ర చేసినా రాని మైలేజ్ ఒకే ఒక్క ఘటనతో షర్మిల సొంత మైంది. తెలంగాణలో రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అనూహ్యంగా ఇతర పార్టీలతో పాటుగా గవర్నర్ మద్దతు దొరికింది.
వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి అని ట్వీట్ చేశారు. గవర్నర్ ఏ కోణంలో షర్మిలకు మద్దతు ఇచ్చారో తెలియదు. ఒక మహిళపై దాడి జరిగినందుకు మద్దతు ఇచ్చారా? టీఆర్ఎస్ అంటే ఉన్న కోపంతో మద్దతు ఇచ్చారా? చెప్పలేం. గవర్నర్ షర్మిల పై దాడిని ఖండించిన తరువాత, ఆమెకు మద్దతు ఇచ్చిన తరువాత ఢిల్లీ బీజేపీ పెద్దలు షర్మిల ఎపిసోడ్ గురించి ఆరా తీసారు. రాష్ట్రం లోని బీజేపీ నేతలు వెంటనే సంఘీభావం ప్రకటించారు.
మరోపక్క కవిత వర్సస్ షర్మిల ట్వీట్ల వార్ కొనసాగుతోంది. .కారులో షర్మిల కూర్చొని ఉండగానే..పోలీసులు ఆమె కారును లాక్కుంటూ వెళ్లటంతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. దీనిని బీజేపీ నేతలతో పాటుగా గవర్నర్ తప్పు బట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ షర్మిలకు మద్దతుగా నిలిచారు. గవర్నర్ షర్మిలకు మద్దతుగా చేసిన ట్వీట్ ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేసారు. షర్మిల వ్యవహారం జాతీయ మీడియాను ఆకర్షించింది. ఈ ఘటన పైన ఢిల్లీ బీజేపీ నేతలు రాష్ట్ర నాయకులతో ఆరా తీసారు. షర్మిల ను కారులోనే ఉండగానే వాహనం లాగటం పైనే ఇప్పుడు నేతలంతా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ మద్దతుగా నిలిచారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకు వచ్చిన షర్మిల పైన ఇప్పుడు ఢిల్లీ బీజేపీ దృష్టి పెట్టింది.
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోర్టులో పోరాడి భైంసా సభకు అనుమతి తెచ్చుకున్నా.. ఆ సభ కంటే షర్మిల ఘటనకే ప్రాధాన్యత..ప్రచారం లభించింది. షర్మిల బలం – ఓటింగ్ గురించి కూడా బీజేపీ ఆరా తీస్తోంది. వైఎస్ షర్మిల అరెస్టు తీరు రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీస్తోంది. షర్మిలను అరెస్టు చేసిన విధానంపై బీజేపీ నేతలు సంఘీభావం తెలుపుతుండగా, కవిత దానిపై సెటైర్లు వేశారు. కవిత వరుసగా చేస్తున్న ట్వీట్లు..షర్మిల కౌంటర్లు..టీఆర్ఎస్ నేతలు షర్మిల లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలతో ఇప్పుడు తెలంగాణలో షర్మిల చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. మొత్తంగా షర్మిలను బీజేపీ కోవర్టుగా టీఆర్ఎస్ ముద్ర వేస్తోంది. మరి షర్మిల ఈ రాజకీయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.