అమరావతి రాజధాని విషయంలో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు అయిదు కీలకమైన విషయాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి విచారణ చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు కొన్ని కీలకమైన అంశాల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అవి వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతూంటే అమరావతి ఏకైక రాజధాని అని సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వెల్లడించిందని సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి అని సుప్రీం ఎక్కడ చెప్పిందో అయ్యన్న చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు.
తాము అమరావతిని ఏకైక రాజధానిగా చేస్తూ ఆనాడు తీర్మానం అసెంబ్లీలో చేశామని అయ్యన్న గుర్తు చేశారు. అదే ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన అంటున్నారు. జగన్ కానీ అసెంబ్లీ కానీ దాన్ని మార్చలేవని ఆయన పాత పాట పాడారు. అయితే దానికి సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ముడిపెట్టి ఆయన సుప్రీం ఇదే రుజువు చేసిందని చెప్పడమే విడ్డూరమని వైసీపీ నేతలు అంటున్నారు.
సుప్రీం కోర్టు ఈ కేసుని జనవరి 31కి వాయిదా వేసింది. కోర్టు అమరావతి రాజధాని విషయంలో స్పెషల్ లీవ్ పిటిషన్ మీద సమగ్రమైన విచారణ జరపనుంది. అసెంబ్లీకి రాజధాని విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందా లేదా అన్నది కూడా సుప్రీం కోర్టు పూర్తి విచారణ ద్వారానే వెల్లడి అవుతుంది. కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం అతి ఉత్సాహంతో ఈ రకంగా మాట్లాడుతున్నారు అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయినా సుప్రీం తీర్పు వచ్చేవరకూ ఆగలేరా అని వారు నిలదీస్తున్నారు.