ఏపీ రాజకీయాలో సీనియర్ నేతలలో ఒకరైన వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటేనే కేరాఫ్ విజయనగరం అని చెబుతారు. ఆయన 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ని బాగా ఉపయోగించుకుని గెలిచారు. ఇక అదే ఎన్నికల్లో మొత్తం అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వైసీపీ గెలిచి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది.
బొత్స చీపురుపల్లి నుంచి ఇప్పటికి మూడు పర్యాయాలు గెలిచారు. గెలిచిన ప్రతీ సందర్భంలో ఆయన మంత్రిగా ఉన్నారు. జగన్ క్యాబినేట్ లో సైతం అయిదేళ్ల మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీకి బాగానే సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
విజయనగరం జిల్లాలో బొత్సను ఓడిస్తాను అని లేటెస్ట్ గా ఒక శపధం చేశారు ఆ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కిమిడి నాగార్జున. ఈయన 2019 ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్ధిగా నిలబడి ఓటమి పాలు అయ్యారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడిగా రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నాగార్జున వైసీపీని ఏపీలోనే బంగాళాఖాతంలో పడేస్తామని భారీ ప్రకటనలు ఇస్తున్నారు.
పెదనాన్న కిమిడి కళా వెంకటరావు అండ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. దాంతో టీడీపీ జెండా ఎగరేస్తామని జూనియర్ తమ్ముడు ఉత్సాహపడుతున్నారు. ఆయన ఆత్మ విశ్వాసానికి శభాష్ అనక తప్పదు. అంతటి ధీమా ఢక్కా మెక్కీలు తిన్న జిల్లాలో టీడీపీ సీనియర్లకు కానీ అధినాయకత్వానికి కానీ కలగకపోవడమే ఆలోచించాల్సిన విషయం అని అంటున్నారు. మరి తలపండిన బొత్స ఈ జూనియర్ నేత చేతిలో ఓడతారా అంటే వచ్చే ఎన్నికల్లో జనాలు ఇచ్చే తీర్పు బట్టి అది ఆధారపడి ఉంటుంది.