2024 నాటికి మరో ఆర్ఆర్ఆర్

వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాతో పాటు మరో ఆర్ఆర్ఆర్ కూడా రాబోతోంది. అది ఎంపీ రఘురామ కృష్ణంరాజు సినిమా. 2024 ఎన్నికల నాటికి తన…

వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాతో పాటు మరో ఆర్ఆర్ఆర్ కూడా రాబోతోంది. అది ఎంపీ రఘురామ కృష్ణంరాజు సినిమా. 2024 ఎన్నికల నాటికి తన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ చేస్తానంటున్నారు ఈ ఎంపీ. ఈ మేరకు కథా చర్చలు, సంప్రదింపులు ప్రారంభించినట్టు ప్రకటించారాయన.

“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని ఉంది. నాకు ఇండస్ట్రీతో చాలా సంబంధాలున్నాయి. కాకపోతే నేను ఇంకా వైసీపీలోనే ఉన్నాను. కాబట్టి అప్పుడే సినిమా తీయడంపై నిర్ణయం తీసుకోలేను. బహూశా.. పార్టీ నుంచి బయటకెళ్లిన తర్వాత తీస్తానేమో. ఆ సినిమాలో నా రాజకీయ జీవితం, నేను ఎదుర్కొన్న సంక్షోభం గురించి కూడా కొంచెం ఉండొచ్చు. నేను సినిమావాళ్లతో కలిసినప్పుడు ఇలాంటి చర్చలు చాలా వచ్చాయి. ఒకరిద్దరైతే ఏకంగా స్క్రిప్టులతో కూడా నన్ను కలిశారు. ఆ స్క్రిప్టులు కాదు, నా మైండ్ లో వేరే స్క్రిప్టు ఉందని కూడా వాళ్లతో చెప్పాను. ఆ టైమ్ వస్తే తప్పకుండా సినిమా తీస్తాను.”

ఇలా ఏపీ ప్రభుత్వంపై సినిమా తీసే ఆలోచనను బయటపెట్టారు రఘురామ. 2024 నాటికి ఆ సినిమా రిలీజ్ అవుతుందని, ఆ సినిమాతోనే ఎన్నికలకు వెళ్తానని ఆయన నర్మగర్బంగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. వచ్చే ఎన్నికల్లో తను కీలకంగా మారతానని, ఫలితాల్ని శాసిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఇక పొత్తులపై మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీ కలిసే అవకాశాలున్నాయన్నారు.

“బీజేపీ-టీడీపీ కలిస్తే బలమే. టీడీపీకి బీజేపీ బలహీనత మాత్రం అవ్వదు. కాకపోతే చంద్రబాబు టచ్ లో ఉన్నారో లేదో తెలియదు. నా విశ్లేషణ చెప్పమంటే మాత్రం చంద్రబాబు తిరిగి తన గ్రాండ్ ఓల్డ్ అలయెన్స్ (బీజేపీ-జనసేనతో పొత్తు)తో ముందుకెళ్తే మంచిది. క్షేత్రస్థాయిలో జనం కూడా ఇదే కోరుకుంటున్నారు. జగన్ చేస్తున్న అప్పులపై 5-6 నెలలుగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. మా పార్టీకి (వైసీపీ) కొంత ఆదరణ తగ్గిన మాట వాస్తవం.”

గతంలో టీడీపీలో ఏడాదిపాటు కొనసాగారు రఘురామ. ఆ అనుభవంతో లోకేష్ సమర్థుడని మాత్రం చెప్పగలననన్నారు. అలాఅని వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం తనకు ఇష్టం లేదంటున్నారు. బాబు ఇంకా చురుగ్గానే ఉన్నారు కాబట్టి, చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలన్నారు.