పింఛన్ల విషయంలో జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు

ఏపీలో సామాజిక పింఛన్లు తొలగిస్తున్నారు, వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారంటూ కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. పింఛన్లు పెంచుకుంటూ వెళ్తామన్న జగన్, ఇప్పుడు కోసుకుంటూ వచ్చేస్తున్నారని, రకరకాల అర్హతల పేరు చెప్పి లబ్ధిదారుల…

ఏపీలో సామాజిక పింఛన్లు తొలగిస్తున్నారు, వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారంటూ కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. పింఛన్లు పెంచుకుంటూ వెళ్తామన్న జగన్, ఇప్పుడు కోసుకుంటూ వచ్చేస్తున్నారని, రకరకాల అర్హతల పేరు చెప్పి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేస్తున్నారనేది ప్రతిపక్షాల వాదన. వారి వాదనకు బలం చేకూర్చేలా.. ఇటీవల కరెంటు బిల్లులు, పొలాల పాస్ పుస్తకాలు తీసుకురావాలంటూ వాలంటీర్లు లబ్ధిదారులకు కబురు పెట్టారు.

కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, ఇంటి పన్ను ఎక్కువ కట్టినా పింఛన్ కట్ అయినట్టే లెక్క. దీనికితోడు ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాలంటూ కొత్త నిబంధన కూడా తెరపైకి వచ్చింది. దీంతో సహజంగానే ప్రజల్లో కాస్త ఆందోళన నెలకొంది. ఇదెక్కడి గోల అంటూ లబ్ధిదారులు కాస్త టెన్షన్ పడినమాట వాస్తవమే.

అయితే సామాజిక పింఛన్ల విషయంలో జగన్ ప్రభుత్వం మరీ అంత మొండిగా వెళ్లదలుచుకోలేదని అర్థమవుతోంది. గత నెల కంటే ఈనెల పింఛన్ల సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి రుజువు. 

సెప్టెంబర్ లో 59 లక్షల మందికి ఏపీలో సామాజిక పింఛన్లు అందజేస్తే.. అక్టోబర్ లో ఆ సంఖ్య 60.81 లక్షలకు పెరిగింది. అంటే లక్షా 81వేల మందికి అదనంగా పింఛన్లు ఇచ్చారనమాట. అనర్హులను ఏరిపారేస్తున్నారు, పింఛన్లు కోసేస్తున్నారంటూ తప్పుడు రాతలు రాసిన పచ్చపాత మీడియా కూడా ఈ గణాంకాలు చూసి సైలెంట్ అయింది.

ఇంటికి ఒకటే పింఛన్ ఇవ్వాలని 2014లోనే చంద్రబాబు నిర్ణయించారు. దాన్ని ఇప్పుడు సవరించాలని చూస్తోంది జగన్ ప్రభుత్వం. అంతేకాదు పింఛన్ అర్హతను 65 ఏళ్లనుంచి 60కి తగ్గించింది కూడా జగనే. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా 10వేల రూపాయలు ఆర్థికసాయం చేస్తుంది కూడా జగన్ సర్కారే. 

గతంలో జన్మభూమి కమిటీ ఆమోదం ఉంటేనే పింఛన్ మంజూరయ్యేది. ఇప్పుడంతా పారదర్శకం. నేరుగా వాలంటీర్ ఇంటికే తెచ్చి సొమ్ము చేతిలో పెట్టే పరిస్థితి. అది కూడా ఒకటో తేదీ ఠంచనుగా. ఈ పద్ధతులన్నిటినీ జనం మెచ్చుకున్నారు.

అనర్హులను ఏరివేయడం మంచి పద్ధతే కానీ.. ఆ క్రమంలో అర్హులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే జగన్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో అనర్హుల ఏరివేత అంటూ హడావిడి చేసినా, చివరకు లబ్ధిదారులకు నష్టం జరక్కుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది.