ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒకే యాడ్ ఫ్రేమ్ లో కనిపించారు. ఇందులో పెద్దగా రాజకీయం లేకపోయినా, ఆసక్తిదాయకంగా ఉంది ఈ వ్యవహారం. ఆ యాడ్ ను ఇచ్చిన వ్యక్తి మహరాష్ట్రకు చెందినవాడు. శివసేన నేత. తనకు టీటీడీ బోర్డులో సభ్యత్వం లభించిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ కృతజ్ఞతలు తెలిపారు.
మిలింద్ నర్వేకర్ అనే మహారాష్ట్ర వ్యక్తి ఇటీవల నియమితమైన టీటీడీ బోర్డులో స్థానం దక్కించుకున్నారు. టీటీడీ బోర్డులో తెలుగు వారితో పాటు .. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారికి కూడా ఒక్కో సభ్యత్వం లభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి శివసేన సెక్రటరీ స్థానం సంపాదించినట్టుగా ఉన్నాడు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీ బోర్డులో చోటు కోసం తమ వారిని ప్రతిపాదిస్తూ ఉంటాయి. తమ కోటా మేరకు ఏపీ ప్రభుత్వానికి పేర్లను పంపిస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడి శివసేన నేత స్వప్నం నెరవేరినట్టుగా ఉంది. టీటీడీ బోర్డులో చోటు అంటే భక్తులకు మాటలేమీ కాదు. ఈ క్రమంలో కోరిక నెరవేరిన నేపథ్యంలో వెంకటేశ్వరుడికి సేవ చేసుకునే అవకాశం దక్కిందని నర్వేకర్ తెలుగు పేపర్ల ద్వారా కూడా తన సంబరాన్ని పంచుకున్నాడు.
తన పేరును సిఫార్సు చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ల ఫొటోలతో యాడ్ ఇచ్చాడు. శివసేన యువనేత, ఉద్ధవ్ ఠాక్రే తనయుడి ఫొటోతో పాటు, బాల్ ఠాక్రే ఫొటోలను కూడా ఆ యాడ్ లో పెట్టారు. ఇలా వెరైటీ కాంబినేషన్లో ఉందా కృతజ్ఞతా పత్రం!