హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ప్రతిపక్షాలకు పెద్ద విజయమనే చెప్పాలి. కానీ ఎక్కడా హడావుడి, సంబరాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము ఆశించిన విధంగానే గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడినప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు పండగ చేసుకోవాలి కదా? మరెందుకు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలగక మానదు.
నిజమే, గవర్నర్ ఆదేశాలు ప్రతిపక్షాలకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎందుకంటే నిమ్మగడ్డ కంటే రాజధాని అంశం ప్రతి పక్షాలకు అతి ముఖ్యమైన అంశం. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండు బిల్లులపై గవర్నర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదే సందర్భంలో నిమ్మగడ్డపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడం వెనుక వ్యూహం ఉందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలంగా నమ్ముతోంది. మరోవైపు రాజధాని మార్పు, నిమ్మగడ్డ వ్యవహారాలపై తమ అధికారులు టీవీ చర్చలలో పాల్గొనకూడదని బీజేపీ నాయకత్వం ఆదేశించడం వెనుక ఆ పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నట్టు అర్థమవుతోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిగవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. గవర్నర్ గురించి ఇంతకు మించి ఒక్క వాక్యం కూడా లేకపోవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందంటున్నారు.
బహుశా ఒకట్రెండు రోజుల్లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉండనుందని టీడీపీ భయపడుతోంది. నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ నిర్ణయంపై అత్యుత్సాహంతో ప్రశంసలు కురిపిస్తే…కేవలం రెండు రోజుల గ్యాప్‌లోనే అదే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని తప్పు పట్టడంలో అర్థం లేదని భావించడం వల్లే టీడీపీ సంయమనం పాటిస్తోందని తెలుస్తోంది.
నిమ్మగడ్డ విషయమై హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు…ఒక రకంగా మున్ముందు తాను తీసుకునే కీలక నిర్ణయానికి సంబంధించి వార్నింగ్‌గా టీడీపీతో పాటు ప్రతిపక్షాలు ఆందోళన చెందు తున్నాయి. ఆ భయంతోనే ప్రతిపక్షాలు వేచి చూసే ధోరణిలో మౌనం పాటిస్తున్నట్టు అర్థమవుతోంది.