కేసీఆర్ – జగన్ ప్లాన్‌కు కేంద్రం చెక్!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి చేసిన ఒక ప్రణాళికకు కేంద్రప్రభుత్వం సాంతం చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానించడానికి తెలుగు రాష్ట్రాలు ఒక కసరత్తు చేస్తున్నాయి. ఈలోగా.. కేంద్రం మరో…

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి చేసిన ఒక ప్రణాళికకు కేంద్రప్రభుత్వం సాంతం చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానించడానికి తెలుగు రాష్ట్రాలు ఒక కసరత్తు చేస్తున్నాయి. ఈలోగా.. కేంద్రం మరో ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. గోదావరి జలాలను ఏకంగా కావేరితో అనుసంధానించాలనేది వారి ఆలోచన! అదే గనుక కార్యరూపం దాలిస్తే.. ఇక తెలుగురాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నానికి ఇంచుమించుగా చెక్ పడినట్లే.

జగన్ ప్రభుత్వం కొలువుదీరిన నాటినుంచి కేసీఆర్ గోదావరిని కృష్ణతో అనుసంధానించే పాట పాడుతున్నారు. రాయలసీమకు గోదావరి నీళ్లు ఇచ్చేస్తా అని ఆయన అక్కడి ప్రజలకు హామీ ఇచ్చేశారు కూడా. అక్కడికేదో తాను రాయలసీమ సంక్షేమం కోసం కంకణం కట్టుకున్నంత బిల్డప్ ఇచ్చారు. ఏదేమైనా ఆయన ప్లాన్ ప్రకారం… గోదావరి నీటిని శ్రీశైలం డ్యాంకు తరలిస్తే.. బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ ద్వారా రాయలసీమకు పంపవచ్చు. అయితే.. గోదావరి నుంచి శ్రీశైలం వరకు తవ్వే కాలువల ద్వారా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయి. ఆ తరువాతనే… నీళ్లు ఎంతో కొంత శ్రీశైలం డ్యాంకు వస్తాయి.

ఈ ప్రాజెక్టు వల్ల గరిష్ట లాభం తెలంగాణకు జరుగుతుంది. అయితే ఖర్చులో ఏపీ ప్రభుత్వం ఎంత వాటా భరించాల్సి ఉంటుందో ఇంకా లెక్క తేల్చలేదు. అధికారులు, ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాలు మాత్రమే జరిగాయి. జగన్ ద్వారా కేంద్రాన్ని ఈ పథకానికి నిధులు కావాలని కేసీఆర్ అడిగించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కేంద్రాన్ని అడిగి నిధులు తీసుకుని.. ఈ పథకం చేపట్టాలనేది వారి ప్లాన్.

అయితే ఇప్పుడు కేంద్రం మరో సొంత ఆలోచనతో ముందుకొచ్చింది. నిజానికి ఇది మూడేళ్లుగా నలుగుతున్న ఆలోచన. ఇప్పుడు డిజైన్ ను కొద్దిగా మార్చి బడ్జెట్ కసరత్తు కూడా పూర్తిచేశారు. దాని ప్రకారం. జానంపేట నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్ కు తరలిస్తారు. అక్కడినుంచి.. కావేరికి తరలిస్తారు. ఇదంతా కాలువలు కాకుండా.. భూగర్భంలో పైపులైన్ల ద్వారా, ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే జరుగుతుంది.

ఇది గనుక అమల్లోకి వస్తే.. అదనంగా తెలుగు సీఎంలు తలపెడుతున్న రెండో అనుసంధాన పథకానికి కేంద్రం రూపాయి కూడా విదిలించకపోవచ్చు. ఎందుకంటే.. ఈ పథకానికే లక్ష కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక మరో అనుసంధాన ప్రాజెక్టుకు ఎందుకనే ప్రశ్న తలెత్తుతుంది.

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ