తెలంగాణలో బలమైన వెలమ సామాజిక వర్గానికి ప్రతినిధిగా అధికారంలో ఉన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ కి చెక్ పెట్టడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుని ఇప్పుడు తెరపైకి తెస్తోంది. ఇటీవలే బీజేపీలో రాజకీయ సభ్యత్వం తీసుకున్న విద్యాసాగర్ రావు.. పార్టీలో క్రియాశీలకంగా మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ మాజీ గవర్నర్ రాకతో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.
ఇన్నాళ్లూ కాస్త సైలెంట్ గా ఉన్న కిషన్ రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్ ని, టీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆర్థిక క్రమశిక్షణ లేదని, కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం తరపున.. పక్కరాష్ట్రాల వారికి వెండి బహుమతుల పేరుతో కోట్లరూపాయలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఇటీవల కేసీఆర్ పై విమర్శల డోసు పెంచిన కిషన్ రెడ్డి, పార్టీపై పూర్తిస్థాయిలో తనపట్టు పెంచుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పొరపాటున తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తే.. ముఖ్యమంత్రి అభ్యర్థి తానే కావాలని ఇప్పటినుంచే పథకాలు రచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కిషన్ లో ఇంత టెన్షన్ రావడానికి కారణం, అనుకోకుండా తెరపైకి వచ్చిన విద్యాసాగర్ రావు.
హుజూర్ నగర్ ఎన్నికలు కిషన్ రెడ్డి సామర్థ్యానికి పరీక్షలా మారాయి. తెలంగాణ ఉపఎన్నిక బాధ్యతను కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డిపైనే పెట్టింది బీజేపీ. అక్కడ పార్టీ బలంగా లేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనీసం రెండోస్థానంలో అయినా నిలబడలేకపోతే అప్రతిష్ట అని, దానికి తగ్గట్టుగా ప్రచార ఏర్పాట్లు, ఎన్నికల ప్రణాళిక రచించుకోవాలని కిషన్ రెడ్డికి సూచించింది.
అయితే అది అనుకున్నంత సులభమేం కాదని తెలుసుకున్న కిషన్ రెడ్డి తన తంటాలేవో తాను పడుతున్నారు. మరోవైపు విద్యాసాగర్ రావు కూడా పార్టీలోకి వస్తుండటంతో సహజంగానే కిషన్ రెడ్డిలో అభద్రతా భావం మొదలైంది. ఇప్పటివరకూ వెంకయ్య నాయుడు వల్ల రాజకీయంగా అనుకున్నంతగా ఎదగలేకపోయిన కిషన్ రెడ్డి, వెంకయ్య పార్టీకి దూరమైన తర్వాతే కేంద్రమంత్రి అయ్యారు.
సరిగ్గా ఇంలాంటి టైమ్ లో వెలమ సామాజిక వర్గం పేరుతో అధిష్టానం విద్యాసాగర్ రావుని తెచ్చి తనపై రుద్దడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కిషన్ రెడ్డి.