ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి పునర్నియమించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారని కొన్ని చానళ్లలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ నిజమేనా? ఇది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. హైకోర్టు ఆదేశాల మేరకు తనను తిరిగి నియమించాలని రెండు రోజుల క్రితం గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తన సమస్యలను ఓపికతో విని సానుభూతితో పరిశీలిస్తానని హామీ ఇచ్చారన్నారు.
తాజాగా ఆయన్ను ఎస్ఈసీగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారంటూ కొన్ని చానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంత కీలకమైన ఈ సమాచారాన్ని రాజ్‌భవన్ వర్గాలు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదనేది ప్రధాన ప్రశ్న.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం మాట మాత్రమైనా సంప్రదించకపోవడం…రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణకు దారి తీసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ లేఖ రాయడం మరో సంచలనం.
చివరికి పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపు, తమిళనాడు రిటైర్డ్ జడ్జి నియామకం చకాచకా జరిగిపోయాయి. దీంతో హైకోర్టుకు ఎస్ఈసీ వ్యవహారం చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో నిమ్మగడ్డ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
అనంతరం ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తన నియామకాన్ని చేపట్టలేదని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సోమవారం కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియ మించాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారంటూ కేవలం కొన్ని చానళ్లలోనే వార్తలు వస్తుండడం అనుమానం కలిగిస్తోంది. ఇదే నిజమైతే రాజ్‌భవన్ వర్గాలు అధికారికంగా ఎందుకు ప్రకటించలేదన్నది రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న.