ప్రత్యర్థిని సరిగా అర్ధం చేసుకోలేకపోతే ధీటుగా ఎదుర్కోలేం. వాలి బలం ఏంటో తెలియకపోతే రాముడు చెట్టుచాటుకు వెళ్ళేవాడు కాదు. ప్రత్యర్థి బలం ఏంటో, బలహీనత ఏంటో తెలిస్తేనే ఎదుర్కొని విజయం సాధించగలం.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్షాలకు జగన్ ఏంటో అర్ధం చేసుకోవడం కుదరడం లేదు. ప్రతిపక్షాలకే కాదు స్వపక్షంలో కూడా చాలామందికి ఇదే సమస్య.
అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేసింది ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కాదు. తండ్రిగా రాజశేఖర్ రెడ్డి పరిచయం చేసి ఉంటే ఒక తండ్రి తన కొడుకు గురించి ఎలా చెపుతారో అలాగే ఆ కొడుకు పరిచయం అయ్యేవాడు.
కానీ తండ్రి రాజకీయాల్లో ఉండడం వల్ల, తండ్రి ప్రత్యర్థులే తనయుణ్ణి తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.
జగన్ ఒక అవినీతి పరుడు. జగన్ ఒక ఫ్యాక్షనిస్టు. జగన్ ఒక అహంభావి. ఇదీ ప్రత్యర్ధులు, మీడియా జగన్ను పరిచయం చేసిన తీరు.
తెలుగు రాష్ట్రాల్లో జగన్ అంటే చాలామందికి తెలిసింది, తెలిసేది కూడా అవినీతి పరుడు, ఫ్యాక్షనిస్టు, అహంభావి అనే.
అలాంటి జగన్ ను గత పదేళ్ళుగా అదే ప్రజలు చూస్తున్నారు.
గత యేడాదిగా ప్రజలు, అధికారులు చూస్తున్నారు. 2009 తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు పరిచయం అయిన జగన్ వేరు.
2009 తర్వాత జగన్ నడుస్తాడు. నుదురు ముద్దాడుతాడు. అవినీతిపై పోరాటం అంటాడు. నేనున్నాను అంటాడు. జనాన్ని ఆకట్టుకుంటాడు. “కన్నమదాసు”లను సిద్ధం చేసుకుంటాడు.
అవినీతి పరుడు, ఫ్యాక్షనిస్టు, అహంభావి అంటే నమ్మిన అదే జనం “నేనున్నాను” అంటే కూడా నమ్మేశారు.
రాజకీయ ప్రత్యర్ధులు ఈ 2019 జగన్మోహన్ రెడ్డిని చూడ్డం లేదు. కనీసం చూసేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదు.
ప్రత్యర్ధులు 2009 వరకూ తాము పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నారు. వారు 2009కి ముందు తాము పరిచయం చేసిన జగన్ తోనే 2020లో పోరాడుతున్నారు.
ఆయన ప్రత్యర్ధులు 2009లోనే ఆగిపోయారు. ఆయన మాత్రం 2019 దాటి వెళ్లిపోతున్నారు.
Facebook post from Gopi Dora