దళితుల్ని చులకనగా చూస్తే ఏమౌతుందో మరోసారి కళ్లుకు కట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఓ దళితుడికి గుండు కొట్టించిన ఘటన వెలుగులోకి రావడంతో… సదరు ఎస్సైనే అరెస్ట్ చేశారు. మరో ఇద్దర్ని సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఫిర్యాదు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ట్రైనీ ఎస్సై షేక్ ఫిరోజ్ షా.. ప్రసాద్ అనే దళిత యువకుడ్ని అదుపులోకి తీసుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పాటు.. అతడికి గుండు కొట్టించాడు. గడ్డం, మీసాలు కూడా తీయించాడు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దళితులపై ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా అంటూ అప్పుడే ప్రతిపక్షాలు విమర్శించడం ప్రారంభించాయి. అయితే వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. గంటల వ్యవథిలో ట్రైనీ ఎస్సైని అరెస్ట్ చేయడంతో పాటు.. అతడికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి మరో ఏడుగురుపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుచేశారు. బాధితుడు ప్రసాద్ ను రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించారు.