'పవర్ స్టార్' అంటూ రామ్ గోపాల్ వర్మ రేపిన చిచ్చు అటు తిరిగి, ఇటు తిరిగి పవన్ ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ గా మారింది! సోషల్ మీడియాలో వాళ్లూ వీళ్లు ఇప్పుడు పరస్పరం నిందించుకుంటూ ఉంటారు.
సోషల్ మీడియాలో సినిమా హీరోల ఫ్యాన్స్ ఎంత సంస్కారవంతంగా నిందించుకుంటారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి గొడవే పవన్ , నందమూరి ఫ్యాన్స్ మధ్య రేగింది.
అయినా ఇప్పుడు ఇష్యూ ఆర్జీవీకి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య కదా.. మధ్యలో బ్లడ్డూ-బ్రీడు ఫ్యాన్స్ ఎందుకు దూరారు? అంటే దాని వెనుక మరో కథ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ సినిమాపై నందమూరి అభిమానులు హ్యాపీగా కనిపిస్తున్నారు.
మామూలుగా వాళ్లు పవన్ కల్యాణ్ ను నిందిస్తే నందమూరి ఫ్యాన్స్ కు హ్యాపీనే. ఆఖరుకు తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతు పలికినప్పుడు కూడా.. పవన్ ను కామెడీ పీస్ గానే ట్రీట్ చేసే వాళ్లు నందమూరి అభిమానులు. తమ పార్టీ విజయంలో పవన్ క్రెడిట్ లేదని వాళ్లు తేల్చి చెప్పే వాళ్లు. పవన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కు ఎప్పుడూ సానుకూల అభిప్రాయాలు లేవు. పవన్ స్వయంగా తెలుగుదేశం ఉద్ధరణ కోసం అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న కృషిని వారు గుర్తించరెప్పటికీ!
ఇప్పుడు ఆర్జీవీ తీసిన సినిమాను వారు మరింత ఆస్వాధిస్తున్నారు. అందుకు మరో కారణాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలో ఇదే రామ్ గోపాల్ వర్మ తమ వాళ్లపై సినిమాలు తీసినప్పుడు పవన్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ.. ఏం చేశారు? అనేది వీళ్ల ప్రశ్న. లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాలను వీళ్లు ప్రశ్నిస్తున్నారు.
ఆ సినిమాలు వచ్చినప్పుడు ఆర్జీవీ తీరును మెగా ట్రూప్ ఖండించలేదని, ఇప్పుడు మాత్రం పవన్ ఫ్యాన్స్ వర్మను తిడుతున్నారని వీళ్లు ఎద్దేవా చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నాగబాబు తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రమోట్ చేశాడని అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. అప్పుడు అలా చేసి, ఇప్పుడు ఆర్జీవీపై దుమ్మెత్తి పోస్తున్నారంటూ.. మెగా ఫ్యాన్స్ పట్ల నందమూరి ఫ్యాన్స్ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.