ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీని చెడామడా తిట్టిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక హోదాని తన భుజాలకెత్తుకున్నంత పనిచేశారు. ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తుపెట్టుకున్న తర్వాత.. అసలు ప్రత్యేక హోదాని ఏపీ ప్రజలే కోరుకోవడంలేదని అందరి తరపున తాను వకాల్తా పుచ్చుకుని మాట్లాడేశారు. అంటే జనం ఏది కావాలనుకుంటే దాని కోసమే పవన్ పోరాడతారట, తమకు అవసరం లేదని జనం అనుకున్నదాని నుంచి పవన్ పక్కకు తప్పుకుంటారట. మరి అదే స్ట్రాటజీ అమరావతి విషయంలో ఎందుకు చేయడంలేదు?
జగన్ అధికారంలోకి వస్తే రాజధాని తరలిస్తారంటూ టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసినా.. రాష్ట్ర ప్రజలు 151 సీట్ల భారీ మెజార్టీతో వైసీపీకి పట్టం కట్టారు. అలా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని ఆమోదించారు. అంటే మూడు రాజధానులకు ప్రజామోదం ఉన్నట్టా.. లేనట్టా? మరి పవన్ ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు.
“రాజధానిపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది, గవర్నర్ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు”.. అంటూ ఎందుకు స్టేట్ మెంట్లు ఇవ్వడం. రాజధాని రైతులకు బాసటగా నిలుస్తామని పవన్ బీరాలు పలకడం దేనికి సంకేతం.
అసలింతకీ పవన్ బాధ ఏంటి? రాజధానిని ఎవరు తరలిస్తున్నారు. అమరావతితో పాటే విశాఖ, కర్నూలుని కూడా సమానంగా అభివృద్ధి చేస్తామనేదే కదా ప్రభుత్వ ప్రతిపాదన. ఉత్తరాంధ్ర వెనకపడిపోయింది, రాయలసీమ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అని చెప్పే పవన్ కల్యాణ్.. మూడు రాజధానుల ప్రతిపాదనని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ ప్రశ్నలకు పవన్ కల్యాణ్ జవాబు చెప్పగలరా.
కేవలం బీజేపీ అజెండాని తాను తలకెత్తుకుని తంటాలు పడుతున్నారు పవన్. టీడీపీతో కలసి ఉన్నంతకాలం ప్రత్యేక హోదాపై ధ్వజమెత్తారు, బీజేపీ పంచన చేరినప్పటినుంచి కమలదళం చెప్పినట్టే తలాడిస్తున్నారు. ప్రజలు పట్టించుకోవడం లేదని ప్రత్యేక హోదా అంశాన్ని వదిలి పెట్టిన పవన్.. అమరావతికి రాష్ట్రవ్యాప్త ఆమోదం ఉందని ఎలా అనుకుంటున్నారు.
ఒకవేళ గవర్నర్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే రాష్ట్ర ప్రజలంతా అమరావతి కోరుకుంటున్నారని చెబుతారనుకోవడం పవన్ భ్రమ. ఆ భ్రమ నుంచి ఆయన ఎంత త్వరగా బైటపడితే అంత మంచిది.