వివాదాలకు పెట్టింది పేరైన రామ్ గోపాల్ వర్మ మరో వివాదం రేపాడు. “పవర్ స్టార్” టైటిల్ తో సినిమా ప్రకటించినప్పట్నుంచి వివాదాలకు కేంద్ర బిందువైన ఈ దర్శకుడు.. ట్రయిలర్ రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. మొన్నటివరకు ఆర్జీవీకి, పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య మాత్రమే యుద్ధం అన్నట్టున్న పరిస్థితి కాస్తా ఇప్పుడు ఇతర హీరోలకు కూడా పాకింది.
ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ అభిమానులు చాలామంది ఉన్నారు. వీళ్లలో ఒకడు నిఖిల్. పవర్ స్టార్ ట్రయిలర్ వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యాడు నిఖిల్. “శిఖరం చూసి కుక్క ఎంత మొరిగినా ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా” అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.
రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించే నిఖిల్ ఆ ట్వీట్ చేశాడనే విషయం ఇక్కడ స్పష్టమౌతూనే ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ ట్వీట్ ను తలకెత్తుకున్నారు. దీంతో పాటు కొంతమంది మెగా కాంపౌండ్ వ్యక్తులు (పీఆర్వోలు, మేనేజర్లు, డిజిటల్ మీడియా వ్యక్తులు) కూడా వర్మపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఎమోజీలు, శాడిజం క్లిప్పింగ్స్ తో వర్మను ఆడుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మరో హీరో నితిన్ మాత్రం ఇంకా ఈ ట్రయిలర్ పై రియాక్ట్ అవ్వలేదు.
మరోవైపు పవన్ ఫ్యాన్స్ లో ఉన్న అనైక్యతే తన సినిమా విజయం అంటున్నాడు వర్మ. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ట్రయిలర్ ను, ఫుల్ మూవీని చూడకూడదని నిర్ణయించుకున్నారనే ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన వర్మ… పవన్ ఫ్యాన్స్ లో అంత ఐక్యత లేదంటున్నాడు.
ఒకరికి తెలియకుండా ఒకరు పవన్ అభిమానులంతా ఈ సినిమాను ఇంట్లో కూర్చొని చూస్తారని, తమలో తాము నవ్వుకుంటారని గట్టి నమ్మకంగా చెబుతున్నాడు. ఈనెల 25న తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో పవర్ స్టార్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు వర్మ.