పోసానిదీ కోట శ్రీనివాస‌రావు ప‌రిస్థితే అవుతుందా?

తెలుగు సినిమా హీరోల‌కు అభిమానులు అని చెప్పుకునే వారు ఉగ్ర‌వాద మ‌న‌స్త‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అభిమానం హ‌ద్దులు మీర‌డం తెలుగునాట చాలా రొటీన్. సోష‌ల్ మీడియా అయినా, నిజ‌జీవితంలో అయినా వారు హ‌ద్దులు దాట‌తారు.…

తెలుగు సినిమా హీరోల‌కు అభిమానులు అని చెప్పుకునే వారు ఉగ్ర‌వాద మ‌న‌స్త‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అభిమానం హ‌ద్దులు మీర‌డం తెలుగునాట చాలా రొటీన్. సోష‌ల్ మీడియా అయినా, నిజ‌జీవితంలో అయినా వారు హ‌ద్దులు దాట‌తారు. అలా హ‌ద్దులు దాట‌డ‌మే సినీ అభిమానం అనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. హీరోల క‌టౌట్ల‌కు జంతు బ‌లుల‌తో మొద‌లుపెడితే.. థియేట‌ర్ల‌లో నాన్ సెన్సిక‌ల్ గా బిహేవ్ చేయ‌డ‌మంతా అభిమాన‌మే! 

ఇక సోష‌ల్ మీడియాలో అయితే ఏ హీరో అభిమానీ ఈ దుర్మార్గాల‌కు మిన‌హాయింపు కాదు. పెద్ద హీరోల కొత్త సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రైనా వాటిని చూసి త‌మ ఫేస్ బుక్ అకౌంట్ల‌లో రివ్యూల‌ను పోస్టు చేసినా.. ఈ అభిమానులు స‌హించ‌లేరు! ఆ సినిమాలు బాగోలేవ‌ని చూసిన వారు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తే అంతే సంగ‌తులు!

కామెంట్ సెక్ష‌న్లోకి వ‌చ్చి కాట్లాట మొద‌లుపెడ‌తారు ఈ అభిమానులు! ఆ రివ్యూను పోస్టు చేసిన వాడు త‌మ‌కు తెలిసిన వాడో, కొన్నాళ్లుగా త‌మ‌కు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా ఉన్న వాడో.. అయినా వాడితో గొడ‌వ‌కు దిగ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌రు! ఆ హీరో క‌న్నా ఈ ఫేస్ బుక్ ఫ్రెండే ఎక్క‌డో ఒక చోట ఉప‌యోగ‌ప‌డ‌తాడు. అయితే త‌మ అభిమాన హీరో సినిమా బాగోలేద‌ని ఫేస్ బుక్ లో రాశాడంటూ.. త‌మ సోష‌ల్ మీడియా స్నేహితుల‌తో త‌గ‌వు పెట్టుకోవ‌డానికి ఈ అభిమాన హృద‌యాలు  రెడీ అయిపోతాయి!

సినిమా గురించి చ‌ర్చ పోయి.. నీఛ‌మైన మాట‌ల‌తో వ్య‌క్తిగ‌త దాడికి దిగుతారు. ప‌చ్చి బూతుల‌తో రెచ్చిపోతారు. ఈ బూతుల్లో డిగ్రీల‌ను క‌లిగి ఉండ‌టం సినిమా హీరోల అభిమానుల‌కు ప్ర‌త్యేక అర్హ‌త అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఇలాంటి ఉగ్ర‌వాద ముఠాల్లా త‌యార‌యిన సినీ హీరోల అభిమాన‌గ‌ణం ఎంత‌కైనా తెగించ‌గ‌ల‌దు.

ఈ క్ర‌మంలో న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళిపై  ముందుగా భౌతిక దాడి ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఆ త‌ర్వాత నిన్న రాత్రి పోసాని ఇంటిపై రాళ్ల దాడికి కూడా ప‌వ‌న్ అభిమానులు తెగ‌బ‌డ్డారు. అయితే పోసానికి ఇంత‌టితో కూడా ప్ర‌మాదం దాటి పోక‌పోవ‌చ్చు. ముందు ముందు కూడా పోసాని ఎక్క‌డ దొరుకుతాడా.. అని ప‌వ‌న్ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.

వెనుక‌టికి ఎన్టీఆర్ పై తీసిన వ్యంగ్య సినిమాలో న‌టించినందుకు త‌ను చాలా ర‌కాల దాడుల‌ను ఎదుర్కొన్న‌ట్టుగా కోట శ్రీనివాస‌రావు ఈ మ‌ధ్య కూడా చెప్పారు. ఎన్టీఆర్ క్ష‌మించినా, ఆయ‌న అభిమానులుగా చెప్పుకునే వారు ర‌క‌ర‌కాలుగా వేధించార‌ని, ఒక రైల్వే స్టేష‌న్లో త‌న‌పై దాడి జ‌రిగింద‌ని, త‌న‌ను నేల‌పైకి తోసేసి మీద కూర్చున్నార‌ని.. కోట చెప్పారు. అలాగే ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ త‌న మొహం మీద ఉమ్మేసిన వైనాన్ని కూడా చెప్పుకుని బాధ‌ప‌డ్డారు.  

కోట ఈ ఉదంతాల‌ను వివ‌రించిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కూడా బాల‌కృష్ణ తీరును ఖండించారు సోష‌ల్ మీడియాలో. బాల‌కృష్ణ‌ది ఎంత నీఛ‌మైన మ‌న‌స్త‌త్వ‌మో అంటూ ధ్వ‌జ‌మెత్తారు. అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల వంతు వ‌చ్చింది. తెలుగునాట సినీ అభిమానం ఎంత దుర్మార్గ‌మైన పోక‌డ‌ల‌కు పోతూ ఉందో ఈ ఉదాహ‌ర‌ణ‌లు స్ప‌ష్ట‌త‌ను ఇస్తున్నాయి.