జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పూర్తిగా ఓ క్లారిటీకీ వచ్చేశారు. ఇకపై బీజేపీతో కలసి వెళ్లేందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడటం లేదు.
ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాల విషయంలో కూడా కమలదళంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు పవన్ కల్యాణ్. బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వకపోతే బాగుండేదని, ఆ పార్టీ ఇంకా కష్టపడి పనిచేసి ఉండాల్సిందని అన్నారు కూడా.
అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తమకు సీట్లు తగ్గాయనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ మిత్రపక్షాన్ని కలుపుకోలేదు. వైసీపీని గద్దె దించుతాం, అధికారంలోకి వస్తామంటున్నారే కానీ, ఉమ్మడి పోరాటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
జనసేన… జనసేన మాత్రమే..
వైసీపీతో జనసేన ఫైట్ కి సిద్ధమంటూ ప్రకటించారు పవన్ కల్యాణ్. తాను రెడీగా ఉన్నానని, వైసీపీ వాళ్లు ఏ స్టైల్ లో కోరుకుంటే, ఆ స్టైల్ లో ఫైట్ చేస్తానన్నారు. ఇకపై జనసైనికులు కూడా ఎక్కడా తగ్గకూడదని హితోపదేశం చేశారు.
ఈ క్రమంలో బీజేపీతో కలసి వెళ్తామని చెప్పలేదు, కలిసే ప్రయాణం ఉంటుందని మాట్లాడలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న క్రమంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ సమర్థతను పవన్ పదే పదే ప్రస్తావించేవారు. ఈ సారి అది కూడా లేదు. బీజేపీ వాసనే పవన్ కి ఇష్టం లేదన్నట్టు ప్రవర్తించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తులు..
పవన్ ప్రసంగంలో టీడీపీ అనుకూల మీడియా భలే పాయింట్ పట్టుకుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికనే తాను ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఇప్పుడు కూడా పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో కలుస్తారని బాబు అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. అయితే పవన్ మాత్రం ప్రస్తుతానికి తాను ఒంటరిగానే బరిలో దిగుతాననే సంకేతాలిచ్చారు. 2024లో వైసీపీకి షాకిచ్చి జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.