హీరోయిన్లంటే అందాలను ఎరవేసే ఫొటోల్లోనే కాదు.. ఇలా కాస్త వైవిధ్యం చూపే ప్రయత్నం కూడా చేయవచ్చు! ఈ ప్రపంచంలోని చాలా మంది నటులకు కనీసం ఒక్కసారైనా చాప్లిన్ స్టైల్లో కనిపించడం ఆసక్తిదాయకమైన ముచ్చట. తెలుగులో అయితే.. పెద్ద పెద్ద స్టార్లు కూడా కనీసం ఒక్క ఫ్రేమ్ లో అయినా చాప్లిన్ గెటప్ వేసిన వాళ్లే!
సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలాంటి వాళ్లు కూడా 'నేను చార్లీ చాప్లిన్ ను…' అంటూ పోజివ్వడానికి ఎంతో కష్టపడ్డారు! ఇక విదేశాల్లో అయితే చాప్లిన్ గెటప్ ఎవరిగ్రీన్. చాప్లిన్ ను మరిపించే రీతిలో చాప్లిన్ గెటప్ వేయడానికి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. చాప్లిన్ బతికున్న రోజుల్లోనే ఇలాంటి పోటీ ఒకటి జరిగిందట.
చాప్లిన్ గెటప్ లలో అనేక మంది ఒక షోకు హాజరయ్యారట. వారిలో ఎవరు బాగా చాప్లిన్ ను అనుకరిస్తారు, ఎవరు నిజంగా చాప్లిన్ లా కనిపిస్తారు..అనే పోటీ అది. ఆ పోటీలో ఒక వ్యక్తి విజేతగా నిలిచాడు. కొసమెరుపు ఏమిటంటే.. ఆ షోలో స్వయంగా చాప్లిన్ కూడా తన వేషంలో పాల్గొన్నాడట. ఆయనను తోసి మరొకరు సిసలైన చాప్లిన్ గా నిలిచాడట. ఇదీ చాప్లిన్ వేషానికి ఉన్న క్రేజ్!
మరి అలాంటి ప్రయత్నమే చేసింది నటి నభా నటేష్. చాప్లిన్ డ్రస్ లో ఆయనను అనుకరిస్తూ ఒక సరదా ప్రయత్నం చేసింది. గ్లామర్ షో ఫొటోలు కాకుండా, చాప్లిన్ గెటప్ లో ఫొటోలను షేర్ చేసింది. మరి చాప్లిన్ గెటప్ లో నభాకు ఎన్ని మార్కులు పడతాయో!