చాలా తక్కువగా సినిమాలు చేస్తుంటుంది శృతిహాసన్. అన్ని భాషల్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో తెలుగులో ఒకటి, తమిళ్ లో ఒకటి, అలాగే బాలీవుడ్ లో ఓ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తుంది. అయితే అన్ని వేళల్లో తను పెట్టుకున్న రూల్స్ కు కట్టుబడి ఉండనంటోంది శృతిహాసన్. సలార్ లాంటి సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు, రూల్స్ అన్నీ పక్కనపెట్టి, అలాంటి సినిమాలు చేస్తానని చెబుతోంది. దీనికి ఆమె చెప్పే లాజిక్ కూడా కరెక్ట్ గా ఉంది.
“సలార్ లాంటి పెద్ద సినిమాల్లో నటించడం వల్ల నా లాంటి హీరోయిన్లకు చాలా మేలు కలుగుతుంది. ఒకే సినిమాతో పలు భాషల్లో, చాలా రాష్ట్రాల్లో పాపులర్ అవ్వొచ్చు. దేశమంతా మనల్ని చూస్తుంది. అందుకే సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాల్ని వదులుకోను. ఏ భాషలో ఆఫర్ వచ్చినా చేస్తాను.”
ఇక థియేటర్, ఓటీటీ మధ్య తేడాలు కూడా చెప్పింది శృతిహాసన్. కొన్ని సినిమాలు థియేటర్లలోనే చూడాలని, మరికొన్ని ఓటీటీలో మాత్రమే చూడాలని చెబుతోంది.
“నేను థియేటర్ కి పెద్ద అభిమానిని. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ తో దేన్నీ పోల్చలేం. అయితే థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ లో మాట్లాడితే నేను డిస్టర్బ్ అవుతాను. అలాంటి టైమ్ లో ఓటీటీ బెటర్ అనిపిస్తుంది. ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు కదా. కానీ కొన్ని సినిమాల్ని బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. ఆ సౌండ్, ఆ విజువల్స్ ను థియేటర్లలోనే ఆస్వాదించగలం. అలాంటి బిగ్ సినిమాల్ని నేను థియేటర్లలోనే చూస్తాను.”
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది శృతిహాసన్. ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ చాలా హోప్స్ పెట్టుకుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ… అందరికీ కనెక్ట్ అవుతుందని చెబుతోంది.