దెబ్బమీద దెబ్బ : ఒకటి ఓకే.. మరొకటి కేకే!

భారత రాష్ట్రసమితికి చెందిన ఎమ్మెల్యే సంఖ్య ఒకటి తగ్గింది. ఆ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు వారి ఎన్నికే చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పడమే విశేషం. ఒక తీర్పు గతంలోనే వెలువడగా.. మరో…

భారత రాష్ట్రసమితికి చెందిన ఎమ్మెల్యే సంఖ్య ఒకటి తగ్గింది. ఆ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు వారి ఎన్నికే చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పడమే విశేషం. ఒక తీర్పు గతంలోనే వెలువడగా.. మరో తీర్పు తాజాగా వెలువడింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోన్ రెడ్డి ఎన్నిక చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పేర్కొంది. ఆయన ఎన్నికను రద్దుచేస్తూ, ఆయన స్థానంలో రెండో స్థానంలో నిలిచిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డికె అరుణ ఎమ్మెల్యేగా ఉంటారని కోర్టు తేల్చింది.

నిజానికి ఈ తీర్పు.. భారాసకు దెబ్బమీద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని రోజుల కిందటే.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని, ఆయన స్థానంలో గత ఎన్నికల నాటికి భారాస తరఫున పోటీచేసిన జలగం వెంకటరావు ఎమ్మెల్యే అవుతారని కోర్టు తేల్చింది.

ఆ తీర్పు వల్ల భారాసకు పోయిందేమీ లేదు. నిజానికి ఆ ఎన్నికల నాటికి కాంగ్రెసు తరఫున గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. తర్వాత భారాసలో చేరిపోయారు. ఆయన ఎన్నిక చెల్లకుండా పోయింది. భారాసకే చెందిన (గతంలో ఓడిపోయిన) జలగం వెంకటరావు ఎమ్మెల్యే అయ్యారు. మొత్తంగా చూసినప్పుడు.. భారాస ఎమ్మెల్యే సంఖ్యాబలంలో ఏమీ తేడా రాలేదు. పైగా.. తాజాగా కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొత్తగూడెం స్థానాన్ని జలగం వెంకటరావుకే కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పు మాత్రం ఆయనకు దెబ్బే. ఎందుకంటే.. గతంలో భారాసనుంచి గెలిచిన క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని అనడం వలన, గద్వాలలో అప్పుడు కాంగ్రెసు తరఫున పోటీచేసిన డికె అరుణ ఎమ్మెల్యే అవుతున్నారు. కానీ ఆమె ఇప్పుడు భాజపాలో ఉన్నారు. దీంతో భారాస కౌంట్ ఒకటి తగ్గింది. 

ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. కొత్తగూడెంలో గతంలో వనమా గెలిచింది కేవలం 5 వేల ఓట్ల తేడాతోనే.. కానీ గద్వాలలో ఏకంగా 28వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన డికె అరుణకు ఇప్పుడు దక్కిన ఎమ్మెల్యే పదవి పెద్ద శుభవార్తేం కాదు. రాబోయే ఎన్నికల్లో తాను పడవలసిన కష్టంనుంచి ఊరట ఇచ్చే నిర్ణయం కూడా కాదు అని విశ్లేషకులు అంటున్నారు.