బన్నీ చరిత్ర సృష్టించాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కు ఈ ఘనత సాధించి పెట్టింది. 'తగ్గేదేలే..' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్, చూపించిన మేనరిజమ్స్, చేసిన యాక్టింగ్.. అతడ్ని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది.
రేసులో అటు బాలీవుడ్ నుంచి, ఇటు మలయాళం నుంచి చాలా మంది నటులు ఉన్నారు. అంతెందుకు, తెలుగు నుంచే ఆర్ఆర్ఆర్ రూపంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పోటీలో నిలిచారు. వీళ్లందర్నీ క్రాస్ చేసి, ఉత్తమ నటుడిగా నిలిచాడు అల్లు అర్జున్. ఈ అవార్డుతో బన్నీ రేంజ్ మరింత పెరిగింది.
ఇక 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. బెస్ట్ యాక్షన్ డైరక్టర్ గా కింగ్ సోలమన్, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాసమోహన్.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.
ఇక బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ విభాగంలో దేవిశ్రీప్రసాద్, కీరవాణి సంయుక్తంగా అవార్డ్ అందుకున్నారు. పుష్ప సినిమాలో పాటలకు గాను దేవిశ్రీప్రసాద్ కు, ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కీరవాణికి జాతీయ అవార్డులు వరించాయి. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీముడో పాట పాడిన కాలభైరవ, బెస్ట్ మేల్ సింగర్ గా జాతీయ అవార్డ్ దక్కించుకున్నాడు. ఈ అవార్డులతో పాటు బెస్ట్ పాపులర్ ఫిలిం విభాగంలో కూడా అవార్డ్ ఎగరేసుకుపోయింది ఆర్అర్ఆర్ మూవీ.
ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. ఇక జాతీయ స్థాయిలో బెస్ట్ ఫీచర్ ఫిలింగా రాకెట్రీ జాతీయ అవార్డ్ దక్కించుకుంది.