ఒకప్పట్లా మేకర్స్ లెంగ్త్ గురించి ఆలోచించడం లేదు. రెండున్నర గంటలు మాత్రమే ఉండాలనే నిబంధన పెట్టుకోవడం లేదు. కాస్త ఎక్కువైనా, ఇంకాస్త నిడివి పెరిగినా ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఖుషి సినిమా కూడా చేరింది.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2 గంటల 45 నిమిషాలుంది. అయితే ఈ భారీ నిడివి తమ సినిమాకు ఇబ్బంది కలిగించదని చెబుతున్నారు మేకర్స్. కంటెంట్ కనెక్ట్ అవుతుందని అంటున్నారు.
“165 నిమిషాల నిడివితో ఖుషి మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బృందం. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్ కంటే ఓ 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే. కథలో ప్రేక్షకులు లీనమైతే లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేశాయి. ఖుషి కూడా ఆ కోవలోకి చేరుతుంది.”
ఇలా తమ కంటెంట్ పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు మేకర్స్. అయితే ఇలా ఎక్కువ నిడివితో సినిమాను రిలీజ్ చేయడం అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. హిట్ అవ్వొచ్చు, అదే టైమ్ లో తేడా కొట్టే ప్రమాదం కూడా ఉంది.
ఈరోజు రిలీజైన కింగ్ ఆఫ్ కొత్త సినిమానే తీసుకుంటే, ఈ సినిమా 3 గంటలుంది, బోర్ కొట్టిచ్చింది. ఫలితంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ (174 నిమిషాలు), గతంలో వచ్చిన కోబ్రా (3 గంటలు), అంటే సుందరానికి (2 గంటల 56 నిమిషాలు) సినిమాలు ఫెయిల్ అవ్వడానికి నిడివి కూడా ఓ కారణం.
అదే టైమ్ లో వాల్తేరు వీరయ్య (2 గంటల 40 నిమిషాలు), వీరసింహారెడ్డి (2 గంటల 49 నిమిషాలు), ఆర్ఆర్ఆర్ (3 గంటల 2 నిమిషాలు) సినిమాలు లెంగ్తీ రన్ టైమ్ తో వచ్చినప్పటికీ సక్సెస్ అయ్యాయి. అంతకంటే ముందు చూసుకుంటే మహానటి, రంగస్థలం, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.
సో.. ప్రస్తుతం రన్ టైమ్ అనేది అస్సలు ఇష్యూ కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకుడు 3 గంటలైనా కూర్చుంటాడు. అలా కూర్చోబెట్టగలిగే సినిమానే హిట్.