వెనకటికి ఎవడినో బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరు మిరియాలు తాటికాయలంత ఉంటాయని అన్నాట్ట. వాడి వాటంకంటె తెలుగుదేశం చినబాబు.. నారా లోకేష్ తీరు ఏమాత్రం భిన్నంగా లేదు. రాష్ట్రానికి మంత్రిగా ఉండి, ముఖ్యమంత్రికి కొడుకుగా ఉండి.. మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత దయనీయమైన రీతిలో ఓడిపోయిన నారా లోకేష్ ఇంచుమించుగా నాలుగున్నరేళ్లు పూర్తయిన తర్వాత.. తన ఓటమి గురించి కొత్త బొంకులు, కొత్త అబద్ధాలు వండి వారుస్తున్నారు.
తన చేతగానితనానికి అబద్ధాల ముసుగు వేసుకోవడం మాత్రమే కాదు. అటు జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో ఉండే అపరిమిత ప్రజాదరణను కూడా కించపరుస్తున్నారు. పాదయాత్రలో కాసింత జనం కనిపించగానే పూనకం తెచ్చుకుని ఊగిపోతున్నారు. ఇంతకూ నారా లోకేష్ ఏం అంటున్నారో తెలుసా.
ఆయన మంగళగిరిలో ఓడిపోయినందుకు ఎగతాళి చేయడంలో అర్థం లేదట. తెలుగుదేశానికి కంచుకోట లాంటి సీట్లు చాలానే ఉన్నప్పటికీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచిన మంగళగిరిలో తన గెలుపు కష్టం అని తెలిసికూడా లోకేష్ దానిని ప్రత్యేకంగా ఎంచుకున్నారట. అక్కడికేదో తాను ఆ ఎన్నికల్లో హీరోయిజం ప్రదర్శనకు దిగినట్టుగా లోకేష్ డప్పు కొట్టుకుంటున్నారు.
అమరావతి రాజధానిని ప్రకటించిన పుణ్యమాని.. ఆ ప్రాంత ప్రజలంతా తమను నెత్తిన పెట్టుకుని ఓట్లు కుమ్మేస్తారనే కుట్రపూరిత ఆలోచనేతోనే లోకేష్ మంగళగిరిలో బరిలోకి దిగారు. తీరా దిగిన తర్వాత లోతు తెలియడంతో.. భయమేసి ఓటర్లకు అడ్డగోలుగా తాయిలాలు పంచిపెట్టారు. అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఓటర్లకు ఏసీలు సహా పంపిణీ చేయడం వివాదాస్పదం అయింది కూడా. ఇన్ని వేషాలు వేసినప్పటికీ.. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఆ ఓటమిని సమర్థించుకుంటున్నారు.
ఇంకా టూమచ్ ఏంటంటే.. ‘ఎప్పుడూ తెదేపా గెలవని సీటు నాకు ఇవ్వండి’ అని 2019లో ఆయన తండ్రిని అడిగాడుట. అడగడం ఎందుకు? ఎప్పుడూ తెదేపా గెలవని పులివెందులనే ఎంచుకుని ఉంటే సరిపోయేది కదా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. పులివెందుల లాంటి కోటలో జగన్ గెలవడంలో వింతేముంది అని చినబాబు నిలదీస్తున్నారు. మరి, అక్కడ బరిలోకి దిగి జగన్ ను ఓడించి.. తన సత్తా నిరూపించుకుని ఉండొచ్చు కదా… అనేది ప్రజల ప్రశ్న.
మొన్న పాదయాత్రకు మంగళగిరిలో వచ్చిన స్పందన చూశారుగా అంటూ వాపును చూసి బలుపుగా చినబాబు మురిసిపోతున్నారు. అలాంటప్పుడు.. ఈసారి మంగళగిరిలో ఓడిపోతే గనుక.. ఇక రాజకీయాల జోలికి రానని, అసలు పార్టీ వ్యవహారాలకు కూడా పూర్తిగా దూరమైపోతానని ప్రకటించగల దమ్ము, సత్తా లోకేష్ కు ఉన్నాయా? అనే ప్రశ్న ప్రత్యర్థులనుంచి వినిపిస్తోంది.