భారాస సారథి చంద్రశేఖరరావు.. పొత్తుల విషయంలో హ్యాండ్ ఇవ్వడం.. తమ విజ్ఞప్తులను, వేడికోళ్లను ఏమాత్రం చెవిన వేసుకోకుండా.. ఏకపక్షంగా తమకు సమాచారంకూడా లేకుండా.. వారి పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడం అనేది.. వామపక్షాలకు అతి పెద్ద షాక్.
నిజానికి కేసీఆర్ ఇలా మాత్రమే స్పందించవచ్చునని వామపక్ష నాయకులు తప్ప ప్రతి ఒక్కరూ ఊహించారు. అయితే.. సీట్ల మీద ఆశతో.. కేసీఆర్ ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న ఆ పార్టీల నాయకులు.. వాస్తవాన్ని గుర్తించలేకపోయారు. తీరా భారాస అభ్యర్థుల ప్రకటన తర్వాత వారిలో కాకపుట్టింది.
ఉభయ పార్టీలు కలిసి ఓ భేటీ నిర్వహించుకుని.. ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బరిలో దిగడానికి తామేమీ అర్రులు చాచడం లేదని, ఎవరి పొత్తులూ లేకపోయినా సరే.. చెరి మూడు స్థానాల్లో పోటీచేస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. పైకి ఎలాంటి మాటలు చెప్పినప్పటికీ.. వారి ధోరణి గమనిస్తోంటే.. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని ఊరేగడానికి ఎగబడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రత్యేకించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏమిటో కేసీఆర్ కు రుచిచూపిస్తాం అని చాలా గంభీరంగా చెబుతున్నారు. ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ సీట్లలో తమ పార్టీకి ఒక్కోచోట పదేసి వేల కంటె ఎక్కువ ఓట్లు ఉన్నాయని కూనంనేని చాలా గట్టిగా చెబుతున్నారు. అంత బలం ఉంటే మంచిదే. 30 సీట్లలో పదేసి వేల ఓట్ల ఓటు బ్యాంకు ఉన్నప్పుడు తమకు ముప్పయి సీట్లు కావాలని అడగకుండా.. మూడే ఎందుకు అడిగారు? అంటే కాస్త హేళన చేసినట్టుగా ఉంటుంది.
కానీ.. ఎటూ సొంతంగా పోటీచేయదలచుకున్నాక.. గెలుపోటముల ప్రసక్తి కాకుండా.. పోటీచేయడం, పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే టార్గెట్ అయిన తర్వాత.. ప్రతి చోటా పోటీచేస్తే.. కనీసం పార్టీ ప్రాభవం పెరుగుతుంది కదా.. అని వారి కార్యకర్తల మనోగతం.
కానీ.. తమకు 30 నియోజకవర్గాల్లో పదేసి వేల ఓట్లున్నాయని కూనంనేని ప్రకటించడం అనేది కాంగ్రెస్ పార్టీతో పొత్తులకోసం సంకేతాలు పంపడం తప్ప మరొకటి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘మాకు మేం కోరినట్టుగా మూడు సీట్లు ఇవ్వండి.. మిగిలిన 27 సీట్లలో మీ విజయానికి ఉపయోగపడుతాం’ అని కూనంనేని సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది. వారికి 30 నియోజకవర్గాల్లో బలం ఉన్నది నిజమే అయితే.. ఆ 30 సీట్ల జాబితా కాంగ్రెస్కు ఇచ్చేసి, అందులోచి ఏ మూడు నియోజకవర్గాలను తమకు ఇచ్చినా ఓకే అని చెప్పగల తెగువ ఉందా? అనే సందేహం కూడా పలువురికి కలుగుతోంది.
అయినా కాంగ్రెస్- వామపక్షాల మధ్య పొత్తు కుదిరేట్లయితే.. అది ఈ లెవెల్లో జరిగే నిర్ణయం కాదని.. వీరెన్ని సంకేతాలు పంపినా.. ఢిల్లీ లెవెల్లో నిర్ణయం జరుగుతుందని.. సెప్టెంబరు 17న హైదరాబాదులో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాజా కూడా హాజరవుతారని వారు చెబుతున్న నేపథ్యంలో.. ఆలోగా ఢిల్లీలో డిసైడ్ చేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.