వైసీపీ మేనిఫెస్టోలో ఎక్కడా రైతు రుణమాఫీ ప్రస్తావనే లేదు, ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచింది అంటే.. రుణమాఫీ చేస్తామని చెప్పకపోయినా ప్రజలు ఓటేశారనే లెక్క. అంటే రుణమాఫీని ఎవరూ కోరుకోలేదు, బదులుగా జగన్ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం రైతు భరోసాపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడితో ఈ విషయం సింపుల్ గా తేలిపోయింది.
రైతులకు రుణమాఫీ అక్కర్లేదు, తమ భవిష్యత్ కి పెట్టుబడి భరోసా కావాలి. అందుకే వాళ్లు టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టి, వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. మధ్యలో చంద్రబాబుకి ఏంటీ దురద? రుణమాఫీ విషయంలో ఆయనకెందుకింత ఆందోళన? 4, 5 విడతల రుణమాఫీని రద్దు చేస్తూ ప్రభుత్వం పాత జీవోని కొట్టివేస్తే చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం ఆయన అసమర్థతనే గుర్తు చేస్తోంది.
ఎవరు ఔనన్నా కాదన్నా 2014 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ అంశం టీడీపీని గట్టెక్కించింది. ఒక్క సంతకంతో అందరి అప్పులు తీర్చేస్తానంటూ కోతలు కోసిన బాబు, తర్వాత రుణమాఫీ పథకానికే తూట్లు పొడిచారు. బంగారు తనఖాని లెక్కలో నుంచి తీసేశారు. రుణమాఫీకి పరిమితి విధించారు. 87వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాయామంత్రం చేసి 24వేల కోట్లకు తగ్గించారు. అదైనా సరిగా చేశారా అంటే అదీ లేదు. ఐదేళ్ల కాలంలో 24వేల కోట్ల రూపాయల రుణాలు కూడా మాఫీ చేయకుండా రైతుల్ని దగా చేశారు.
ఐదేళ్లలో మూడు విడతలు మాత్రమే (అది కూడా అరకొరగా) రుణమాఫీ చేసి, మిగతా రెండు విడతలు ఇవాళ, రేపు అంటూ కాలయాపన చేసి చివరకు ఎన్నికలకు ముందు జీవో విడుదల చేసి, ఆ నిధులు కూడా రాకుండా పరోక్షంగా తానే అడ్డుకున్న నీఛమైన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జీవో రద్దుపై జగన్ ని విమర్శించడం విడ్డూరం కాక మరేంటి?
టీడీపీ హయాంలో ఐదేళ్లలో రుణమాఫీ కింద విడుదలైన నిధులు 15,279 కోట్ల రూపాయలు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 64లక్షల మంది రైతులకు ఏటా 12500 రూపాయల చొప్పున 16వేల కోట్లకు పైగా విడుదల చేయబోతోంది. పంటబీమాకి ఉచితంగా ఇస్తున్న 2వేల కోట్ల రూపాయలు దీనికి అదనం. అంటే మూడేళ్లలో చంద్రబాబు ముక్కీ మూలిగీ ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువగా, ఏడాది వ్యవధిలోనే జగన్ అన్నదాతలకు అందిస్తున్నారు. అలాంటప్పుడు ఇక రుణమాఫీతో పనేంటి?
ఈమాత్రం లాజిక్ లేకుండా బాబు ఎగిరెగిరి పడుతుంటే సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పడుతున్నాయి. బాబు చేసిన అప్పు జగన్ ఎందుకు తీర్చాలంటున్నారు నెటిజన్లు. తన ఉనికిని కాపాడుకోవడం కోసం, ప్రజలు తనను మరిచిపోకుండా ఉండడం కోసం బాబు ఇలా నాటకాలు ఆడుతున్నారు తప్ప, లేవనెత్తిన అంశంలో పస లేదని స్వయంగా టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు.