జగన్ అమరావతి నుంచి కదలడం లేదు. ఎమ్మెల్యేలను ఎక్కువగా కలవడం లేదు. పార్టీ బాధ్యులతో కూడా ఎక్కువగా సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. కానీ రాజకీయ వ్యూహాలు మాత్రం చాలా సైలంట్ గా పన్నుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గంలోకి ఇధ్దరు మంత్రులను చేర్చుకోవడంతో పాటు ఓ మంత్రికి ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వడం వెనుక జగన్ రాజకీయ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో ఓ చిత్రమైన పరిస్థితి వుంది. బలమైన మెజారిటీ కులాలు అన్నీ బిసి ల జాబితాలో వున్నవే. కాళింగ, కొప్పల వెలమ, కాపు, గవర ఈ నాలుగు కమ్యూనిటీలు బిసిల జాబితాలో వున్నవే. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ నాలుగు కులాలతో పాటు యాదవ, మత్స్యకార కులాలు కూడా గట్టి ప్రభావం చూపించగల స్తాయిలో వున్నాయి.
ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహమేమిటంటే, ఈ ప్రధాన కులాలు అన్నింటినీ దగ్గరకు తీయడం. ఉత్తరాంధ్రలో కాపులకు ఇప్పటికే పెద్ద పీట వేసారు. బొత్స, అవంతి శ్రీనివాస్ లకు మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే కాళింగులకు చెందిన తమ్మినేని ని స్పీకర్ ను చేసారు. వెలమ అయిన ధర్మాన కృష్ణదాస్ ను మంత్రిని చేసారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి ధర్మానకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెలమలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. విశాఖ జిల్లాలో బండారు, అయ్యన్న, శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు లకు పదవులు ఇవ్వడం, విజయనగరం జిల్లాలో కూడా వెలమ అభ్యర్థులను ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వడం చేసారు. కానీ చంద్రబాబు ఎందుకో కాళింగులను పెద్దగా పట్టించుకోలేదు. అలాగే తూర్పు కాపులను కూడా. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన గంటాకు కాపు కోటాలో మంత్రి పదవి ఇచ్చి తూర్పు కాపులను వదిలేసారు. కళా వెంకటరావును మాత్రం కాస్త దగ్గరకు తీసి ఆ లోటు పూడ్చాము అనిపించారు.
ఇప్పుడు జగన్ వెలమలకు ప్రాధాన్యత ఇస్తూనే, అటు కాళింగులు, ఇటు కాపులను కూడా దగ్గర తీసారు. అదే సమయంలో మిగిలిన కులాలను కూడా సమతూకంలో చేరేలే చేసారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో వెలమనాయకుల వాయిస్ వినిపించకుండా అయింది తెలుగుదేశం పార్టీలో. అదే సమయంలో ధర్మానకు డిప్యూటీ సిఎమ్ ఇవ్వడం అంటే ఇక మరి ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి వుండదు.
గవర్లు మిగిలారు
సమతూకం వరకు వస్తే విశాఖ జిల్లాలో గవర్లు కొంత వరకు ఇంకా ప్రాధాన్యతకు దూరంగానే వున్నారు. ఎమ్మెల్యేల సంగతి సరే, పదవులు ఇవ్వాల్సి వుంది. విశాఖ కార్పొరేషన్ పరిథిలో రాజకీయంగా ప్రభావం చూపించగల పరిస్థితిలో వున్న గవర్ల విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సి వుంది. ఈ దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. విశాఖ మేయర్ టికెట్ ఇచ్చి వారినీ సంతృప్తి పరుస్తారేమో? ఎందుకంటే విశాఖ మేయర్ ఎన్నిక అంటే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన కీలక సామాజిక వర్గాలు అక్కడే వుంటాయి. విశాఖలో ఈ సామాజిక వర్గాలు అన్నీ కూడా గట్టి పట్టుతోవున్నాయి., అందువల్ల జగన్ భవిష్యత్ ను దృష్టిలో వుంచుకునే సామాజిక నప్పుళ్లు నప్పుతున్నారను కోవాలి.