కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వ్యూహాత్మక నిర్ణయం కూడా. ఇంత కీలకం, వ్యూహాత్మకం ఏమిటంటారా ? బహుశా సోనియా గాంధీ హయాంలోనే ఇది గొప్ప నిర్ణయం కావొచ్చు. వచ్చే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకా గాంధీని ఎంపిక చేసింది.
2022 ఫిబ్రవరి లేదా మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం 2020 సగంలోనే ఉన్నాం. అయినప్పటికీ చాలా ముందుగానే కాంగ్రెస్ తన సీఎం అభ్యర్థిని ప్రకటించిందంటే కాంగ్రెస్ పార్టీ చాలా కసిగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రియాంకా గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమన్న ధీమా ఉండొచ్చు.
ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశామని పార్టీ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద్ తెలిపారు. కాబట్టి ఇది విశ్వసనీయమైన సమాచారమని భావించవచ్చు. ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడమనేది కార్యకర్తల సుదీర్ఘ కాల డిమాండ్ అని చెప్పారు. అయితే తన ఎంపికకు ప్రియాంక కూడా వెంటనే అంగీకరించడం విశేషం. యూపీలో కాంగ్రెసును అధికారంలోకి తేవాలనే పట్టుదల ఆమెకు కూడా ఉందని అనుకోవాలి.
ప్రియాంక గాంధీ మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలపట్ల ఆసక్తి చూపలేదు. పార్లమెంటు ఎన్నికల్లో తల్లి నియోజకవర్గమైన రాయబరేలీలో, అన్న నియోజకవర్గమైన అమేథీలో (గత పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ రాహుల్ చేజారింది ) ప్రచారం చేయడంతోనే సరిపెట్టుకునేది. కానీ కొన్ని కారణాలవల్ల ప్రియాంక క్రమంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది.
సోనియాకు ఆరోగ్యం బాగుండటంలేదు కాబట్టి గత పార్లమెంటు ఎన్నికల్లో రాబరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తుందనుకున్నారు. కానీ సోనియానే పోటీ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ కంటే ప్రియాంక బెటరనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది. పార్టీ నాయకులు ప్రియాంకలో ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీని చూస్తున్నారు. ప్రియాంక దాదాపు ఇందిరా గాంధీ పోలికల్లోనే ఉంటుంది. నాయనమ్మ అందం కూడా పుణికి పుచ్చుకుంది.
ఇది పార్టీ నాయకుల అభిప్రాయమే కాదు. యూపీలోని కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం కూడా. అందుకే గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముందు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నప్పుడు అప్పట్లో ఆ పార్టీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రియాంకా గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీకి సూచించారు. కానీ పార్టీ అధిష్టానం పెడచెవిన పెట్టింది. ప్రియాంక కూడా ఆసక్తి చూపించలేదు. ప్రశాంత్ అప్పట్లో బాగా ఆలోచించే ప్రియాంక పేరు సజెస్ట్ చేశాడు. మొదటిది ప్రియాంక గాంధీ -నెహ్రు కుటుంబానికి చెందిన వ్యక్తి. యూపీలో ఆ కుటుంబానికి ఇప్పటికీ ఆదరణ ఉంది. ప్రియాంక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూతురు.
యంగ్ అండ్ బ్యూటీ కూడా. అంటే గ్లామరస్ పర్సన్. ఇందిరా గాంధీలో ఉన్న ఆకర్షణ ఆమెలో ఉంది. ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లు. కానీ అధిష్టానం ఇవేవీ ఆలోచించకుండా దాదాపు 80 ఏళ్ళ వయసున్న, రాజకీయాల నుంచి విరమించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఎందుకంటే ఢిల్లీ సీఎంగా షీలా మూడుసార్లు పనిచేశారు. ఈ బ్యాక్ గౌండ్ తో ఆమెను ఎంపిక చేశారు. వాస్తవానికి ఆమెకు ఆసక్తి లేదు.
సీఎం అభ్యర్థిగా తాను ఉండనని చెప్పారు. కానీ ప్రియాంక ఆమెను కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆనాడు ప్రియాంక ఒప్పుకోకపోవడానికి కారణం ఎన్నికల్లో తాను ఓడిపోతే పరువు పోతుందని. అయితే కాంగ్రెస్ – సమాజ్ వాదీ పొత్తు పెట్టుకోవడంతో సీన్ మారిపోయింది. ఈ పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించింది ప్రియాంకే.
సరే … పొత్తు కుదిర్చింది కదా. యూపీ అంతా తిరిగి ప్రచారం చేస్తుందని రెండు పార్టీల నాయకులు భావిచారు. కానీ ఆమె గమ్మున ఉండిపోయింది. చివరకు కాంగ్రెస్ -సమాజ్ వాదీ కూటమి చావుదెబ్బ తిని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ అనుభవాల అన్నిటి దృష్ట్యా ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కాంగ్రెస్ ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉండొచ్చు.