ఈనాడుకు ఊపిరిపోసింది విశాఖే గురూజీ?

ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ముఖ్యపట్టణంగా ఉండేది. ఆనాడు ప్రముఖ పత్రికల ప్రధాన కార్యాలయాలు అన్నీ  కూడా అక్కడే ఉండేవి. కొత్త పత్రిక పెట్టాలన్నా కూడా హైదరాబాదే వేదిక అయ్యేది.  ఆ సమయంలో విశాఖలో ఈనాడు…

ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ముఖ్యపట్టణంగా ఉండేది. ఆనాడు ప్రముఖ పత్రికల ప్రధాన కార్యాలయాలు అన్నీ  కూడా అక్కడే ఉండేవి. కొత్త పత్రిక పెట్టాలన్నా కూడా హైదరాబాదే వేదిక అయ్యేది.  ఆ సమయంలో విశాఖలో ఈనాడు పేరిట పత్రికను రామోజీరావు ప్రారంభించారు. అది 1974 ప్రాంతం. ఆ విధంగా ఒక తెలుగు పత్రిక తొలి అడుగు విశాఖలో పడింది.

విశాఖ ఊపిరిని తీసుకుని ఈనాడు ఎదిగింది. ఇప్పటికి నలభై ఆరు ఏళ్ళ క్రితం నాటి ముచ్చట ఇది. అంటే విశాఖ పొటెన్షియాలిటీ గురించి అందరి కంటే రామోజీరావుకే ఎక్కువ తెలిసి ఉండాలి కదా. ఇక ఆయన డాల్ఫిన్ స్టార్ హొటల్ కూడా అంతకు ముందే విశాఖలో ఏర్పాటు అయి ఇప్పటికీ బాగానే  రాణిస్తోంది.

ఇవన్నీ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే విశాఖ మెగా సిటీ అని అంతా అనకముందే రామోజీరావు లాంటి మేధావులు ముందే గుర్తించారు అన్న దాని కోసమే. ఇక తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తిన లేచిన వేళ ఆంధ్రులకు రాజధాని ఎక్కడ అన్న చర్చ కూడా జోరుగా వచ్చేది. ఆ సమయంలో కూడా తెలంగాణా ఉద్యమ కారులతో సహా అందరి నోటి నుంచి వచ్చిన ఏకైన మాట విశాఖ రాజధాని అవుతుందని.

ఇక ఉమ్మడి మద్రాస్ నుంచి వేరు పడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యపట్టణం ఎక్కడ ఉండాలన్నపుడు కూడా విశాఖ పేరు ఎక్కువగానే వినిపించింది. అయితే అప్పటి రాజకీయాలు, ఇతరత్రా పరిస్థితుల మూలంగా కర్నూల్ రాజధానిని చేసుకున్నారన్నది చరిత్ర చెప్పిన సత్యం.

ఇవన్నీ ఇలా ఉంటే రామోజీరావు తన ఉషాకిరణ్ మూవీస్ తరఫున తీసిన ఎన్నో సినిమాలు విశాఖ అందాలనే చూపిస్తాయి.  హైదరాబాద్ తరువాత విశాఖ రెండవ అతి ముఖ్యపట్టణమని నాడు కేంద్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి అనేక పధకాలు మంజూరు చేస్తూ వచ్చాయి. ఇక విశాఖలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసిన వారిలో టీడీపీ సామాజికవర్గం వారే ఎక్కువగా కనిపిస్తారు.

ఆ మధ్య అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని అన్నట్లుగా విశాఖను రాజధాని చేసినా తెలుగుదేశం మద్దతుదారులకు, ఆ సామాజిక వర్గానికి వచ్చిన నొప్పి కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు. కానీ ఇపుడు ఎందుకో ఆకాశాన్ని భూమిని కలిపేసి  మరీ విశాఖను నర మానవుడు కూడా ఉండడానికి వీలులేని సిటీగా చూపించడమే దారుణం. దుర్మార్గమని అంటున్నారు.

ఏది ఏమైనా విశాఖ మీద ఇలాంటి వార్తలు వండి వారుస్తారా. సునామీ ముప్పు నగరంగా  చెబుతారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడుతున్నారు. విశాఖ మీద రామోజీరావు, చంద్రబాబు కలసి కుట్ర పన్నుతున్నారని ఆయన గట్టిగానే  అంటున్నారు. మొత్తానికి విశాఖ విష రాజకీయాలకు బలి కావడం బాధాకరమని సగటు నగర పౌరుడు ఆవేదన చెందుతున్నాడు.

ఆర్జీవీ పవర్ స్టార్ స్పెషల్ ఇంటర్వ్యూ

షకలక శంకర్ డిరా బాబా వెబ్ సిరీస్ ట్రైలర్