టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిది 40 ఏళ్ల రాజకీయ చరిత్ర. ఎవరైనా మాట మాట్లాడితే…”ఏహే నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ. నాకా చెప్పేది. తాతకు దగ్గు నేర్పినట్టుంది…నాకు రాజకీయాలు నేర్పడం” అని చంద్రబాబు ప్రత్యర్థులను ఎగతాళి చేస్తుంటారు. అంతెందుకు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ కంటే రాజకీయాల్లో తానే సీనియర్ అని, కాలం కలిసి వచ్చి ఆయన ప్రధాని అయ్యాడని విమర్శించిన విషయం తెలిసిందే.
తన సమకాలికుడు, మిత్రుడైన వైఎస్ రాజశేఖరెడ్డి తనయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్ జగన్ రాజకీయ అనుభవం అంతా కలిపినా 10-11 ఏళ్లు మాత్రమే. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ అనుభవం అంత జగన్ వయస్సు. కానీ రాజకీయాల్లో తండ్రి మాదిరిగానే జగన్ కూడా మాట తప్పడు-మడమ తిప్పడనే పేరు నిలుపుకున్నారు.
జగన్ను నమ్ముకుని చెడిపోయిన వాళ్లు, చంద్రబాబును నమ్ముకుని ఓడిపోయిన వాళ్లు లేరనే నానుడి తెలుగునాట స్థిరపడి పోయింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, నేడు అధికార పక్షంలో ఉన్నా తనను నమ్ముకున్న లేదా తాను నమ్మిన వాళ్లకు ఏ విషయంలోనూ జగన్ తక్కువ చేయలేదు. కానీ చంద్రబాబు రాజకీయం అందుకు పూర్తి విరుద్ధం. ఇందుకు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, ముస్లిం మైనార్టీ మహిళ జకియా ఖానమ్ పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు గవర్నర్కు వారిద్దరి పేర్లను సిఫార్సు చేశారు. అమలాపురం ఎంపీగా గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అప్పట్లో ఆయనకు టికెట్ కేటాయించలేకపోయారు. జగన్ పాదయాత్రలో పి.గన్నవరం సభలో పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని జగన్ నిలుపుకున్నారు.
ఇక జకియా ఖానమ్ విషయానికి వస్తే సీఎం సొంత జిల్లా రాయచోటి నివాసి. రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అఫ్జల్ అలీఖాన్ భార్యే జకియా ఖానమ్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటి బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ రాయచోటి మైనార్టీలకు ఎమ్మెల్సీ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్జల్ అలీఖాన్ గుండె పోటుతో మృతి చెందాడు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ అప్జల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు అవకాశం రావడంతో ఎమ్మెల్సీ పదవిని అప్జల్ భార్యకు ఇచ్చి తనను నమ్ముకున్న వాళ్లకూ అన్ని వేళలా అండగా ఉంటానని జగన్ మరోసారి నిరూపించారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో వర్ల రామయ్య పేరును ఖరారు చేసినట్టు పెద్ద ఎత్తున తన మీడియా సంస్థల ద్వారా ఊదర గొట్టించారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ వర్ల రామయ్య చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చివరికి ఆ సీటును సీఎం రమేశ్నాయుడికి కట్టబెట్టి తన నైజాన్ని చాటుకున్నారు. అదే కాదు, రెండోసారి కూడా రామయ్యను బలి పశువును చేశారు. అధికార ప్రతినిధి పదవి ఇచ్చి, ఎల్లో చానళ్లను అప్పగించి రోజంతా మాట్లాడుతూ ఉండాలని చేతిలో మైకు పెట్టారు. దాంతోనే వర్ల రామయ్యను సంతృప్తి చెందాల్సిన దుస్థితి.
ఇటీవల ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు సీట్లు అధికార వైసీపీ దక్కించుకునే సంఖ్యా బలం ఉందనే విషయం తెలిసి కూడా…ఐదో అభ్యర్థిగా టీడీపీ తరపున వర్ల రామయ్యతో చంద్రబాబు నామినేషన్ వేయించారు. ఓడిపోయే సీటుకు మాత్రం దళితులు పనికొస్తారనే విమర్శలు చెలరేగాయి. దీన్ని బట్టి జగన్, చంద్రబాబు తమను నమ్ముకున్న వాళ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు.