బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా ఆధ్వర్యంలో రూపొందుతున్న వ్యాక్సిన్ గురించి చేసిన తొలి తొలి ప్రకటనల్లోనే.. అక్టోబర్ వరకూ అది అందుబాటులోకి రాదని స్పష్టం చేశారు. తాము వ్యాక్సిన్ ను రూపొందించినట్టుగా, ట్రయల్స్ జరగాల్సి ఉందని వాళ్లు చెబుతూ వచ్చారు. అందుకు సంబంధించి దశల వారీగా వివరాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత వరకూ హ్యూమన్ ట్రయల్స్ పూర్తైనా.. మరో మూడు నెలల పాటు దాని పనితీరును పరిశోధకులు పరిశీలించనున్నారు.
విజయవంతమైన ఫలితాలు వెల్లడి అయినప్పటికీ.. ఇంకా మూడు నెలల పాటు ఆ వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు అయితే లేదు. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత అయినా అది అందుబాటులోకి వస్తే.. ఇండియాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనేది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. బ్రిటన్ అయితే ఏకంగా 9 కోట్ల డోసులను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందట. తన జనాభా కు మించిన స్థాయిలోనే బ్రిటన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ లను బుక్ చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఇండియా వంటి వాటికి అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ ను అయినా దక్కనిస్తాయా? అనేది సందేహంగా మారుతోంది. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ఇండియాలో పరీక్షించడానికి అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించింది ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ సీరమ్ ఇనిస్టిట్యూట్. అనుమతులు వస్తే ఇండియాలో ఆ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించడానికి ఆ సంస్థ రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో భారీ స్థాయిలో ఉత్పత్తికి కూడా ఆ సంస్థ రెడీగా ఉందట. లార్జ్ వ్యాల్యూమ్స్ లో ఆ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికి కూడా తాము సిద్దంగా ఉన్నట్టుగా ఆ సంస్థ చెబుతోంది. మరి దీన్ని బట్టి.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ విజయవంతం అయితే.. అది ఇండియాకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్టేనేమో!