రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రత్యేకత ఏంటంటే…తన అహంకారాన్ని ఎక్కడా దాచుకోరు. దాచుకోవాలనే ప్రయత్నం కూడా చేయరు. ఆయన బాడీ లాంగ్వేజే ఆయనకు ప్రధాన శత్రువు. దానికి తోడు తానో గొప్ప మేధా విననే భావన కూడా ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతోంది. తాను తెలివైన వాడిననే ఆలోచన ఉంటే తప్పు కాదు కానీ, తాను మాత్రమే… అనుకోవడంలోనే అసలు సమస్య ఉంది.
హైకోర్టు ఆదేశాల మేరకు తన పదవిని పునరుద్ధరించాలని కోరేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్‌ను ఆయన కలిశారు. సహజంగానే జగన్‌కు వ్యతిరేక పరిణామం కాబట్టి ఎల్లో మీడియా ఆ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించింది. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్, నిమ్మగడ్డ భేటీకి సంబంధించి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే…మాజీ ఎస్ఈసీ ఎంత అహంకారో అర్థమవుతుంది.
సహజంగా మన కంటే వయస్సు, హోదాలో పెద్దవాళ్ల దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకుంటాం. నడుచుకోవాలి కూడా. మాట తీరే కాదు, బాడీ లాంగ్వేజీ కూడా చాలా ముఖ్యమైంది. గవర్నర్ ఠీవీగా , హూందాగా కూర్చుంటే, నిమ్మగడ్డ మాత్రం ఆ పెద్దా యన దగ్గర కాలుపై కాలు వేసుకుని కూచోవడం చూపరుల మనసుకు చివుక్కుమనిపించేలా ఉంది. నిజానికి గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడంలో ఒక అర్థం ఉంది. అందుకు విరుద్ధంగా తానే గవర్నర్ అన్న రీతిలో నిమ్మగడ్డ వ్యవహరించడం విమర్శలకు అవకాశం ఇస్తోంది.
దీన్నిబట్టి గవర్నర్ అంటే నిమ్మగడ్డకు ఏ మాత్రం గౌరవ మర్యాదలున్నాయో అర్థమవుతుంది. గవర్నర్ అంటే నిమ్మ గడ్డకు ఏ మాత్రం గౌరవం లేదనేందుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం. జగన్ సర్కార్ నుంచి తనకు రక్షణ కల్పించాలని కేంద్రహోం శాఖకు నిమ్మగడ్డ లేఖ రాయడం, అది తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన గవర్నర్‌ను కూడా కలిసి తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత కూడా గవర్నర్‌ను కలిసిన సందర్భంలో వాళ్లిద్దరి ఏం జరిగిందో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో చెప్పుకోవడం, దాన్ని ‘కొత్తపలుకు’లో రాయడం ఆశ్యర్యం కలిగిస్తోంది.
ఈ నెల 19న ఆర్‌కే తన ‘కొత్తపలుకు’లో గవర్నర్‌ను కించపరిచేలా రాయడానికి నిమ్మగడ్డే కారణం. ఆ వాక్యాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ఒక్కసారి చదువుదాం.
‘రాష్ట్రప్రభుత్వం నన్ను వేధిస్తోంది. రక్షణ కల్పించండి’ అని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒకాయన ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాను ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడానికై కొన్ని వారాల తర్వాత ఆయన మళ్లీ గవర్నర్‌ను కలిశారు.
అప్పుడు గవర్నర్ తన జేబులో నుంచి ఒక కాగితం తీసి, ‘మీరిచ్చిన వినతిపత్రం నా వద్దే ఉంది.. దీనిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను’ అని తాపీగా సెలవిచ్చారట. దీనితో వినతిపత్రం ఇచ్చిన ఆయన అవాక్కయ్యారు’…ఇదీ గవర్నర్‌పై నిమ్మగడ్డ అభిప్రాయం. ఈ రాతలు చదివితే నిమ్మగడ్డ సంస్కారం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మనసులో గవర్నర్‌పై ఇంత విషం నింపుకుని మళ్లీ హైకోర్టు ఆదేశించిందంటూ వెళ్లడం ఒక్క నిమ్మగడ్డకే చెల్లింది. కురు వృద్ధుడైన ఆయన దగ్గర కాలిపై కాలు వేసుకుని నిమ్మగడ్డ కూచున్న తీరు…పెద్దాయనకు ఏమనిపించిందో కానీ, చూసే వాళ్లకు మాత్రం ఇంత ‘అహంకారమా’ అనే భావన మాత్రం కలిగింది.